కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన సోమవారం ఆందోళనలు చేపట్టారు. మండల కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా
పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ప్రజాశక్తి - కలెక్టరేట్ : బ్రిటిష్ కాలంలోనే కార్మికులు పోరాడి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చి వేయడాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు విశాఖ నగరంలో తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ కోడ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ కార్మిక ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల ప్రాథమికమైన సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకొనే హక్కు, యాజమాన్యంతో బేరసారాలాడే హక్కు వంటివి కోల్పోయే ప్రమాదముందని, శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఫిక్స్‌డ్‌టెర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని, యాజమాన్యాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున పోరాడుతోందన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయని, అయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలచే బలవంతంగా అమలు చేయించడం కోసం అన్ని రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులతో ఈ నెల 25, 26 తేదీలలో మన రాష్ట్రంలోని తిరుపతి నగరంలో సమావేశం నిర్వహిస్తోందని అన్నారు. ఈ సమావేశాల నిర్వహణ బాధ్యత నుంచి ఎపి ప్రభుత్వం వైదొలగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాల వల్ల కార్మికులకు కొంత మేలు జరుగుతోందని. వీటిని ఇంకా పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ప్రదర్శనలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎం.శ్రీనివాస్, ఆర్‌కెఎస్‌వి.కుమార్, నాయకులు ఎస్.జ్యోతీశ్వరరావు, వి.కృష్ణారావు, ఎఐటియుసి నాయకులు డి.ఆదినారాయణ, పడాల రమణ, సిఎఫ్‌టియుఐ నాయకులు ఎన్.కనకారావు, పి.వెంకటలక్ష్మి, ఐఎన్‌టియుసి నాయకులు కె.ఈశ్వరరావు, నీరుకొండ రామచంద్రరావు, ఐఎఫ్‌టియు నాయకులు వై.కొండయ్య, జి.లక్ష్మీనారాయణ, టిఎన్‌టియుసి నాయకులు ఎం.శ్రీకృష్ణ, పైడిరాజు, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు వై.మస్తానప్ప, హెచ్‌ఎంఎస్ నాయకులు డి.అప్పారావు, డిఎస్‌ఇయు నాయకులు డివి.రమణా రెడ్డి, లక్ష్మణరావు పాల్గొన్నారు. ప్రదర్శన అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
అనకాపల్లి : లేబర్ కోడ్స్ అమలుకు తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్మిక శాఖ మంత్రుల సమావేశాన్ని నిరసిస్తూ అనకాపల్లిలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించాయి. తొలుత నెహ్రూ చౌక్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక లోకానికి అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లకు అనుకూలంగా నిబంధనలు రూపొందించిందన్నారు. రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చి ఈ కోడ్స్ అమలు చేసే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. దీనివల్ల కార్మిక సంఘాలు తమ హక్కులను కోల్పోతాయన్నారు. ఎఐటియుసి నాయకులు వైఎన్.భద్రం మాట్లాడుతూ ఈ కోడ్స్ వల్ల పని భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ కేవలం ఫెసిలిటేటర్ రోల్ మాత్రమే పోషించనుందన్నారు. కొత్త కోడ్ అమలైతే కార్మిక సంఘాల నిర్మాణం ఆచరణలో సాధ్యం కాదన్నారు. కార్మిక సంఘాలను సులభంగా రద్దు చేసే అవకాశముందన్నారు. ఎఎఐఎఫ్‌టియు నాయకులు కోన మోహన్ మాట్లాడుతూ కార్మిక సంఘాలతో ఎటువంటి చర్చలూ, సంప్రదింపులూ లేకుండానే కేంద్రం ఏకపక్షంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్స్‌ను రూపొందించిందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వివి.శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ, బాలకృష్ణ, గంటా శ్రీరామ్, గండి నాయనబాబు, దాకారపు శ్రీనివాసరావు, ఐద్వా నాయకురాలు డిడి.వరలక్ష్మి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి బి.నూకఅప్పారావు, ఎఐటియుసి నాయకులు కోన లక్ష్మణ, రైతు సంఘాల నాయకులు కె.శంకరరావు, ఎన్.సత్యనారాయణ, దొడ్డి సూర్యారావు, మత్తుర్తి సూరిబాబు, జగదీష్, రామచంద్రరావు, ఆడారి అప్పారావు పాల్గొన్నారు.
పరవాడ : సిఐటియు ఆధ్వర్యంలో లంకెలపాలెం జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. నాయకులు జి.వెంకటస్వామి, ఎస్.శ్రీను, రమణ, రామకృష్ణ, అప్పారావు, గంగరాజు పాల్గొన్నారు.
రాంబిల్లి : సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యాన రాంబిల్లి సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. సంఘం మండల కార్యదర్శి జి.దేవుడు నాయుడు మాట్లాడారు. నాయకులు బట్టి భాస్కరరావు, సిహెచ్.గంగరాజు, రామకృష్ణ, కాశియ్య, రాము పాల్గొన్నారు
అచ్యుతాపురం : మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.రాము మాట్లాడారు. మండల కార్యదర్శి కె.సోమనాయుడు, బాబూరావు, కనకారావు, కిరణ్ పాల్గొన్నారు.










