ప్రజాశక్తి- ఉక్కునగరం : 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్చి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే కార్మికశాఖ మంత్రుల సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన మంగళవారం బిసి గేటు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ (సిఐటియు) అధ్యక్ష, కార్యదర్శులు జి శ్రీనివాసరావు, నమ్మి రమణ మాట్లాడుతూ కార్మికులను కట్టుబానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం కంటే దారుణంగా చట్టాల మార్పునకు పూనుకోవడం పెట్టుబడి దారులకు ఊడిగం చేయడమేననన్నారు. ఐఎన్‌టియుసి నాయకులు కె.అవతారం మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కాలరాస్తామంటే కార్మిక వర్గం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కరరావు, వివి.రమణ, పితాని భాస్కరరావు, కోన రమణ, పిట్ట రెడ్డి, వంశీ, పి.మసేను, స్వామి, మల్లేశ్వరరావు, ఎన్.కృష్ణ, బోర శశిభూషణరావు, సిఐటియు నాయకులు నమ్మి రమణ, జి.శ్రీనివాసరావు, ఐఎన్‌టియుసి నాయకులు కొవిరి అవతారం, వంశీకృష్ణ, ఒనుము అప్పలరాజు పాల్గొన్నారు.
టిటిఐ వద్ద ధర్నా
కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్‌లకు కార్మిక వర్గాన్ని బానీసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఉక్కు గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ, సిఐటియు నాయకులు జె.అయోధ్యరామ్ అన్నారు. కార్మిక చట్టాలపై తిరుపతిలో జరగనున్న సదస్సును రద్దు చేయాలని, కార్మిక చట్టాల్లో మార్పులు చేయవద్దని డిమాండ్ చేస్తూ టిటిఐ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ దేశంలో కార్మికవర్గంపై దాడులు సరికాదని, క్షక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. కేంద్రం అంబానీ, అదానీలకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వ చట్టాలను పార్లమెంట్‌లో అమోదించడం దారుణమన్నారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్ధలను నిర్వీర్యం చేసి, తద్వారా కార్మిక సంఘాల ఉనికిని లేకుండా చెయ్యడానికి కేంద్రం కుటిల రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జె.అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు, కెఎస్‌ఎన్.రావు, వైటి.దాసు, మస్తానప్ప, కారు రమణ, బొడ్డు పైడిరాజు, డీవీ రమణ, జి.గణపతిరెడ్డి, దాసరి సురేష్‌బాబు, రామ్‌కుమార్, ఆకుల నూకరాజు, ఉగ్రం, సన్యాసిరావు, మంత్రి గోపినారాయణ, బీఎన్.రాజు, గంగవరం గోపి పాల్గొన్నారు.










