Sep 30,2021 07:25

.ఇప్పటి వరకు యాజమాన్యాలు యూనియన్ల గుర్తింపునకు 'కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌' (ప్రవర్తనా నియమావళి)ను పాటించాయి. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌కు చట్టబద్ధత లేదు. ఇది స్వచ్ఛందం. 1950, 60వ దశకాల్లో జరిగిన భారత కార్మిక మహాసభల సిఫార్సులు స్టాండింగ్‌ లేబర్‌ కమిటీ ఆమోదం పొందిన తరువాత కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ అమల్లోకి వచ్చింది. యూనియన్ల గుర్తింపు ఎన్నికలు మాత్రమే గాకుండా పారిశ్రామిక వివాదాల చట్టంలో ఉన్న ''వర్క్స్‌ కమిటీలు'' ''ఫిర్యాదుల పరిష్కార కమిటీలు''-వాటి పని, మేనేజ్‌మెంట్‌ చేయకూడని పనులు, యూనియన్లు చేయకూడని పనులు కూడా కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌లో ఉన్నాయి.
'కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌'లో ఉన్న యూనియన్ల గుర్తింపునకు సీక్రెట్‌ బ్యాలట్‌ నిర్వహించటం అనేది పారిశ్రామిక వివాదాల చట్టంలో లేని అంశం. కమిటీలు, అన్‌ఫెయిర్‌ లేబర్‌ ప్రాక్టీసెస్‌ (అన్యాయమైన కార్మిక పద్ధతులు) పారిశ్రామిక వివాదాల చట్టంలో పకడ్బందీగా ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ పాల్పడకూడని 16 ప్రధాన కార్మిక వ్యతిరేక చర్యలు, వాటి కింద మరలా 18 కార్మిక వ్యతిరేక ఉపచర్యలు ఉన్నాయి. యూనియన్లు పాల్పడకూడని 8 ప్రధాన, 2 ఉపచర్యలు మాత్రమే ఉన్నాయి. అన్యాయమైన కార్మిక పద్ధతులకు పాల్పడే యాజమాన్యాలకు పారిశ్రామిక వివాదాల చట్టంలో శిక్షలు ఉన్నాయి. కానీ యూనియన్లు గట్టిగా ఉన్నచోట మాత్రమే, కార్మికులు సంఘటితమై పోరాడిన చోటనే కార్మిక చట్టాలు కొంత వరకైనా అమలవుతున్నాయన్న సంగతి మనకు తెలుసు.
కార్మిక చట్టాలుగానీ, కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ గానీ సరళీకరణ విధానాలు అమలు క్రమం మొదలైన తరువాత తుప్పు పట్టటం మొదలు పెట్టాయి. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌లో ఎన్నికలను లేబరు డిపార్ట్‌మెంట్‌ సీక్రెట్‌ బ్యాలట్‌ పద్ధతిలో నిర్వహిస్తుంది. రిజిస్టరైన అన్ని కార్మిక సంఘాలు ఎన్నికల్లో పాల్గొంటాయి. పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు తెచ్చుకున్న సంఘం రెండు సంవత్సరాల పాటు గుర్తింపు సంఘంగా వ్యవహరిస్తుంది. ఇటీవల కాలంలో యూనియన్లు గట్టిగా ఉన్నచోట, యాజమాన్యాలు సిద్ధమైన చోట మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. యాజమాన్యాలు సిద్ధపకడపోతే స్వచ్ఛందం కాబట్టి చేయగలిగింది లేదు.
1926 ట్రేడ్‌ యూనియన్ల చట్టం, 1947 పారిశ్రామిక వివాదాల చట్టం మరియు 1946 ఇండిస్టియల్‌ ఎంప్లాయిమెంట్‌ (స్టాండింగ్‌ ఆర్డర్స్‌) చట్టం 2020 పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో విలీనమైనాయి. కొత్తగా పార్లమెంట్‌లో పాసయిన నాలుగు కోడ్‌లు కూడా చట్టాలే అన్న సంగతి మరచిపోకూడదు.
పారిశ్రామిక సంబంధాల కోడ్‌ లోని ట్రేడ్‌ యూనియన్ల భాగంలో యూనియన్ల గుర్తింపుకు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి. యూనియన్ల గుర్తింపునకు సంబంధించిన నిబంధనలు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూల్స్‌ సిద్ధం చేసిన తరువాత పారిశ్రామిక సంబంధాల కోడ్‌ అమలులోకి వస్తుంది.
పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో యూనియన్ల గర్తింపు ఎన్నికలకు చట్టబద్ధత వచ్చింది. సంస్థలో ఒకే రిజిష్టర్డ్‌ యూనియన్‌ వుంటే దానికి యజమాని గర్తింపునిస్తాడు. అయితే దానికి మస్టర్‌ రోల్‌ (పర్మినెంట్‌ వర్కర్స్‌)లో ఉన్న కార్మికుల్లో 35 శాతం కనీస సభ్యత్వం వుండాలి. ఒకటి కంటే ఎక్కువ యూనియన్లు వుంటే యజమాని ఒక స్వతంత్ర వ్యక్తిని ఎన్నికల అధికారిగా నియమిస్తాడు. ఆ ఎన్నికల అధికారి కార్మికుల సంఖ్యను బట్టి తనకు తోడుగా మరి కొంత మందిని ఎన్నికల అధికారులుగా నియమించుకోవచ్చు. ఎన్నికల ఖర్చును యజమాని భరించాలి. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ కింద గుర్తింపు పొందిన కార్మిక సంఘం కాలపరిమితి ముగియటానికి మూడు నెలల ముందుగానే కొత్త కోడ్‌ ప్రకారం ఎన్నికల ప్రక్రియ (వెరిఫికేషన్‌) ప్రారంభం కావాలి.
వెరిఫికేషన్‌ ఎన్నికల్లో మొత్తం ఓట్లు (ఓటర్ల జాబితా)లో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు పొందిన సంఘం ఒక్క దానికే గుర్తింపు వస్తుంది. అలా లేనప్పుడు మొత్తం ఓట్లలో ప్రతి 20 శాతం ఓట్లకు ఒక స్థానం చొప్పున నెగోషియేటింగ్‌ కౌన్సిల్‌ (చర్చల వేదిక)లో యూనియన్లకు స్థానం కల్పిస్తారు. ఒక యూనియన్‌ లేదా నెగోషియేటింగ్‌ కౌన్సిల్‌కు 3 సంవత్సరాల కాలపరిమితి వుంటుంది. యజమాని మరియు కార్మిక సంఘాల ఆమోదంతో దీన్ని 5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. గుర్తింపు పొందిన సంఘం లేదా నెగోషియేటింగ్‌ కౌన్సిల్‌-వేతనాలు, పని పరిస్థితులు, సామాజిక భద్రత కేటగిరీలు, బదిలీలు, ప్రమోషన్లు తదితర అంశాలపై చర్చించి ఒప్పందాలు చేసుకుంటాయి. కనీసం 20 శాతం ఓట్లు రాని సంఘానికి నెగోషియేటింగ్‌ కౌన్సిల్‌లో స్థానం ఉండదు. కనీసం 20 శాతం ఓట్లు రావాలన్నా కూడా 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు యూనియన్‌లో సభ్యులుగా ఉండాలి.
కొత్త కోడ్‌లో ఉన్న లోపాలు - ప్రమాదాలు
గుర్తింపు ఎన్నికలకు చట్టబద్ధత వచ్చినప్పటికీ అనేక కార్మిక వ్యతిరేక నియమాలు దానిలో ఉన్నాయి. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ ప్రకారం పోలయిన ఓట్లలో మెజార్టీ తెచ్చుకున్న సంఘం గుర్తింపు పొందుతుంది. గుర్తింపు పొందిన సంఘం 2 సంవత్సరాలు కొనసాగుతుంది. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌లో లేబర్‌ అధికారి ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు. కానీ పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో గుర్తింపు ఎన్నికల ప్రక్రియ యజమానికి అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా రూపొందింది. ఈ కోడ్‌ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కోసం ఒక ప్రైవేట్‌ స్వతంత్ర వ్యక్తిని యజమాని వెరిఫికేషన్‌ అధికారిగా నియమిస్తారు.
మస్టర్‌ రోల్‌లో ఉన్న కార్మికులతో ఓటర్ల జాబితా తయారు చేసి యజమాని ఎన్నికల అధికారికి పంపిస్తాడు. కార్మిక సంఘాల ముందు ఆ లిస్టును పెట్టి వెరిఫికేషన్‌ అధికారి ఓటర్ల జాబితాను ఫైనలైజ్‌ చేసి నోటీసు బోర్డులో పెడతారు. యజమాని, కార్మిక సంఘాల ఆమోదంతో ఎన్నికల తేదీ, సమయం, స్థలం నిర్ణయిమవుతుంది.
పోలైన ఓట్లలో కాకుండా మొత్తం ఓట్లలో ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి గుర్తింపు రావటం ప్రతికూల అంశం. గుర్తింపు పొందిన సంఘం లేదా నెగోషియేటింగ్‌ కౌన్సిల్‌ కాలపరిమితి కనీసం 3 నుండి 5 సంవత్సరాలకు పెంచటం వలన కార్మికులకు నష్టం. ఎన్నికల ప్రక్రియలో లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ జోక్యం లేకపోవటం కార్మికులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వస్తుంది. పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో లేబర్‌ కోర్టులు రద్దయినాయి. ఇక ట్రిబ్యునల్‌కు పోవటమే దిక్కు. ప్రైవేట్‌ యాజమాన్య ఒత్తిడులకు కార్మికులు తట్టుకుని నిలబడాలి. కార్మిక సంఘాలతో సంబంధం లేని ఆ స్వతంత్ర వెరిఫికేషన్‌ అధికారి ఎవరనేది కోడ్‌ నిబంధనలలో స్పష్టత లేదు.
కోడ్‌ పార్లమెంట్‌లో పాసయింది కాబట్టి చేయగలిగింది లేదు. నిబంధనలు కూడా తదనుగుణంగా ఉన్నాయి. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ మాదిరిగానే పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో కూడా పర్మినెంట్‌ కార్మికులకే ఓటింగ్‌ హక్కులు ఉన్నాయి. కాంట్రాక్టు, బదిలీ, టెంపరరీ, డెయిలీ వేజ్‌ కార్మికులు హాజరు పట్టీలో ఉండరు కాబట్టి వారికి ఓటింగ్‌ హక్కులు ఉండవు. మెజార్టీ కార్మికులు అంతకు ముందు లాగనే తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోతారు.
పశ్చిమ బెంగాల్‌, కేరళ వామపక్ష ప్రభుత్వాలు తాము కార్మికుల పక్షమేనని నిరూపించాయి. 1983లో పశ్చిమ బెంగాల్‌, 2010లో కేరళ వామపక్ష ప్రభుత్వాలు ట్రేడ్‌ యూనియన్‌ చట్టాలను సవరించి రహస్య బ్యాలట్‌ పద్ధతిలో గుర్తింపు ఎన్నికలు కార్మిక అధికారులు నిర్వహించే బాధ్యత పెట్టాయి. కార్మికుల నిర్వచనం కిందికి వచ్చే కార్మికులందరికీ కూడా ఓటు హక్కు కల్పించాయి.
మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్ట మార్పులు చేసిన నేటి పరిస్థితుల్లో కార్మిక సంఘాలు మరింత చురుగ్గా పని చేయాలి. కార్మికులందరూ యూనియన్లలో సంఘటితంగాకుండా, మిగిలి ఉన్న హక్కులనైనా అమలు చేయించుకోటానికి పోరాటాలు చేయకుండా కార్మిక హక్కులకు రక్షణ ఉండదు. కార్మికులు సంఘటితమై పోరాడితే కార్మిక వ్యతిరేక నిబంధనలు ఆటంకం కాబోవు.
బ్రిటీషు పరిపాలనా కాలంలో కార్మిక చట్టాలు లేనప్పుడు కూడా వేతనాలు, పని పరిస్థితుల కోసం పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు చెలరేగాయి. వాటిని అదుపులో పెట్టటానికే నిబంధనల రూపంలో కార్మిక చట్టాలు వచ్చాయనేది గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి కార్మిక హక్కులనేవి ఎవరో పెట్టిన భిక్ష కాదు. పోరాడి సాధించుకున్నవి. ఎవరో తీసేస్తే పోయేవి కూడా కావు. కావలసిందల్లా కార్మికులంతా సంఘటితం కావటం...దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటం...మినహా కార్మిక హక్కులు కాపాడుకోటానికి, వాటి అమలు కోసం మరో దారి లేదు.
                                  పి. అజయ్ కుమార్ -  / వ్యాసకర్త - సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు /