లెబనాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు యావత్తు మూడవ ప్రపంచ దేశాలకూ రాబోయే రోజుల్లో ఎదురవనున్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. లెబనాన్ ఒక చిన్న దేశం. ఎక్కువగా దిగుమతులపై ఆధారపడివున్న దేశం. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముసురుకొని వుండడంతో బాటు కరోనా మహమ్మారి విజృంభించిన కారణంగా మరింత ముదిరిన ఆర్థిక సంక్షోభం లెబనాన్‌పై కొన్నాళ్ళుగా తీవ్ర ప్రభావాన్ని చూపింది. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దయనీయమైన పరిస్థితిలో పడింది. లెబనాన్‌కు విదేశీ మారకద్రవ్యం ప్రధానంగా టూరిజం ద్వారా, గల్ఫ్ నుండి అక్కడ పని చేసే లెబనాన్ పౌరులు పంపే సొమ్ము ద్వారా వచ్చేది. ఇప్పుడు ఈ కరోనా కారణంగా ఈ రెండు వనరులూ పూర్తిగా నిలిచిపోయాయి. విదేశీ మారకద్రవ్యం కొరత తీవ్రం కావడం, అన్నింటికీ ప్రధానంగా దిగుమతుల పైనే ఆధారపడాల్సి రావడం వలన లెబనాన్ దేశపు కరెన్సీ విలువ చాలా పడిపోయింది. విదేశీ రుణాల చెల్లింపులను చేయలేని స్థితి వచ్చింది. నిత్యావసర సరుకుల కోసం కూడా దిగుమతుల పైనే ఆధారపడవలసి రావడంతో వాటికి కొరత ఏర్పడి ప్రజానీకం నానా అవస్థలూ పడుతున్నారు. మరోవైపు ధరలు అదుపు తప్పి పెరిగి పోతున్నాయి. ఇప్పుడు అక్కడ ద్రవ్యోల్బణం 56 శాతానికి చేరుకుంది. నిరుద్యోగం 35 శాతం ఉంది. దేశంలో సగానికి పైగా ప్రజలు అధికారిక దారిద్య్రరేఖకు దిగువకు చేరారు.
ఈ లక్షణాలన్నీ కరోనాకు ముందే పొడచూపాయి. కరోనా రావడంతో అవి తీవ్ర రూపం దాల్చాయి. ఈ లక్షణాలు దాదాపు అన్ని మూడో ప్రపంచ దేశాల్లోనూ ఉన్నాయి. దీనికి కారణం ఆ దేశాలన్నీ నయా ఉదారవాద విధానాలను అమలు చేయడమే. ఆ విధానాల పర్యవసానంగా ఈ దేశాలన ఆర్థిక వ్యవస్థలన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో గట్టిగా ముడి వేసుకుపోయి విడగొట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. తమకు 1000 నుండి 1500 కోట్ల డాలర్ల విదేశీ రుణం తక్షణమే అవసరమని లెబనీస్ ప్రభుత్వం కోరుతోంది. అయితే మార్చి నెల నాటికే అది విదేశీ రుణ వాయిదాలను చెల్లించలేక ఎగవేతదారుగా పరిగణింపబడుతోంది. దానివలన కొత్తగా రుణం ఎవరూ ఇవ్వడం లేదు. లెబనాన్‌లో ఉన్న ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. ప్రస్తుత పరిస్థితికి కారణం ఆ దేశం అనుసరించిన ఉదారవాద విధానాలే అయినా దానిని కప్పి పుచ్చి ప్రభుత్వంలో, రాజకీయ నాయకులలో, అధికారులలో నెలకొన్న అవినీతి కారణంగానే ప్రస్తుత దుస్థితి ఏర్పడిందన్న ప్రచారం సాగుతోంది. ఈ అవినీతి గురించిన ప్రచారం కొత్తదీ కాదు, అవాస్తవమూ కాదు. కాని దేశ ఆర్థిక వ్యవస్థ ఈ స్థితిలో ఉండడానికి మూల కారణం నయా ఉదారవాద విధానాలే అన్న వాస్తవాన్ని, ప్రపంచ పెట్టుబడిదారీ విధానం మొత్తంగానే ఈ కారణంగా సంక్షోభంలో పడిందన్న వాస్తవాన్ని ఈ ప్రచారం కప్పిపుచ్చుతోంది. నిజానికి మూడో ప్రపంచ దేశాల్లో చాలా ప్రభుత్వాలు అవినీతికి పాల్పడేవే. అయితే ఈ అవినీతి వల్లే ప్రస్తుత సంక్షోభం ఏర్పడిందనడం పొరపాటు వాదన. ప్రస్తుత సంక్షోభం కేవలం మూడో ప్రపంచ దేశాలకే పరిమితం కాలేదు. అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలలోనూ సంక్షోభం తీవ్రంగానే ఉంది. అంతే కాదు, మితిమీరిన అవినీతి అనేది నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థల్లో ఉండే ఒక లక్షణం. అంతకు ముందున్న వ్యవస్థల్లోనూ అవినీతి ఉండేది. మార్కెట్‌ను ప్రభుత్వం నియంత్రించే విధానాలు అమలు చేసేటప్పుడు సులువుగా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. అయితే పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు పూనుకునేటప్పుడు, కార్పొరేట్లకు భారీగా రాయితీలను కల్పించేటప్పుడు అంతకన్నా ఎక్కువ స్థాయిలో అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే నయా ఉదారవాద దశలో అవినీతి రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది.
ప్రజల్లో లెబనాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం నెలకొని వున్న దశలో, అవినీతికర ప్రభుత్వమే తమ దుర్దశకు కారణం అని వారంతా భావిస్తున్న వాతావరణంలో బీరుట్‌లో అమోనియం నైట్రేట్ భారీ పేలుడు సంభవించింది. ఆ విషాద ఘటన వలన ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. దీంతో మరింత పెద్దఎత్తున ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఇదంతా రాజకీయ నాయకుల అవినీతి కారణంగానే జరిగిందని, వెంటనే ప్రభుత్వం దిగిపోవాలని ప్రజలు రోడ్ల పైకి వచ్చారు. ఆందోళనలు చేపట్టారు. ఆ నిరసన ప్రదర్శనల్లో పోలీసులతో ఘర్షణలు పడ్డారు. వాటిలో 500 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. సంక్షోభంలో చిక్కుకున్న దేశంలో ఈ విధంగా ప్రభుత్వాలు దిగిపోవాలంటూ ఆందోళనలు జరగడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమీ కాదు, ఇటువంటి ఆందోళనలు గతంలోనూ చాలా చోట్ల జరిగాయి. ఈ సందర్భాన్ని సామ్రాజ్యవాద దేశాలు ఏ విధంగా తమకనుకూలంగా మలుచుకుంటున్నాయనేదే ఇప్పుడు కొత్తగా మనం గమనించాల్సిన అంశం. బీరుట్ పేలుడు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న మొట్టమొదటి సంపన్న దేశ ప్రతినిధి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో లెబనాన్ ఫ్రాన్స్ దేశపు వలసగా ఉండేది. ఇప్పటికీ ఆనాటి సామ్రాజ్యవాద దురహంకారాన్నే మాక్రాన్ ప్రదర్శించాడు. రాజకీయ, ఆర్థిక సంస్కరణలు తాము చెప్పిన విధంగా చేపడితే లెబనాన్‌కు ఆర్థిక సహాయం చేస్తామని అతగాడు ప్రకటించాడు. ఆ వెంటనే అమెరికా రంగంలోకి దిగింది. ఆందోళనకారులకు మద్దతు ప్రకటించింది. లెబనీయులిప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్థికాభివృద్థి కోసం, అవినీతి లేని, జవాబుదారీతనం కలిగి వుండే ప్రభుత్వం ఏర్పడాలని, విదేశీ వత్తిడి ఉండరాదని లెబనాన్ ప్రజలు చేస్తున్న పోరాటానికి అమెరికా అండగా ఉంటుందని ప్రకటించింది.
'రాజకీయ, ఆర్థిక సంస్కరణలు' కావాలని మాక్రాన్ అన్నా, 'అవినీతి లేని, జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వం' ఏర్పడాలని అమెరికా అన్నా దాని సారాంశం ఒక్కటే. లెబనాన్‌లో సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఏర్పడాలన్నదే అసలు విషయం. ఇప్పుడున్న ప్రభుత్వం ఇరాన్ బలపరుస్తున్న హిజ్‌బుల్లా కు అనుకూలంగా ఉంది. అది ఇజ్రాయిల్ ప్రయోజనాలకు వ్యతిరేకం. అందుచేత ఆ స్థానంలో ఇజ్రాయిల్ కు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం ఏర్పడాలన్నదే అమెరికా, ఫ్రాన్స్ కోరుకుంటున్నాయి. అటువంటి ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలను మరింత జోరుగా అమలు చేయాలని అవి వాంఛిస్తున్నాయి.
సామ్రాజ్యవాదులు కోరుకున్నట్టే లెబనాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని మాట వరసకు అనుకుందాం. ఆ ప్రభుత్వానికి వారిచ్చే రుణం కొంత కాలం తర్వాతనైనా తీర్చాల్సిందే. అలా తీర్చడానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? కరోనా ప్రమాదం గడిచిపోయిన తర్వాత మళ్ళీ టూరిజం కొంత పుంజుకోవచ్చు. గల్ఫ్ నుండి కూడా మళ్ళీ చెల్లింపులు మొదలవవచ్చు. కాని లెబనాన్‌లో ఏర్పడ్డ సంక్షోభం కరోనా కంటే ముందు నుంచే ఉంది. కరోనా అక్కడ ప్రవేశించక ముందే, మార్చి లోనే లెబనాన్ విదేశీ రుణ వాయిదాల చెల్లింపు చేయలేని స్థితిలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభం పర్యవసానంగానే, తక్కిన మూడో ప్రపంచ దేశాలలో మాదిరిగా, లెబనాన్‌లో కూడా పరిస్థితి దిగజారింది. ఈ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కే సూచనలేవీ సమీప దూరంలో కానరావడం లేదు. అటువంటప్పుడు రుణ వాయిదాలు చెల్లించాలంటే అందుకు పొదుపు చర్యలొక్కటే మార్గం. అంటే ప్రజల సంక్షేమం కోసం చేసే ఖర్చు మరింత తగ్గించడమే. దానివలన ప్రజల చేతుల్లో ఉండే సొమ్ము మరింత తగ్గుతుంది.
రుణం లభిస్తే తక్షణం విదేశీ చెల్లింపుల సమస్య కొంతవరకూ తగ్గుతుంది. అందువలన ద్రవ్యోల్బణమూ కొంత తగ్గుతుంది. కాని పొదుపు చర్యల పేరుతో ప్రజల ఆదాయాలు పడిపోతాయి. దాని వలన నష్టపోయేది సామాన్య ప్రజలే. అదే సమయంలో ఈ కష్ట కాలంలో వెంటనే విదేశీ రుణం లభించడంతో ప్రజలు నయా ఉదారవాద విధానాలను మొత్తంగా ఎదిరించాలనే విధంగా స్పందించే వీలుండదు. లెబనాన్‌లో ఆర్థిక పురోగతి జరగకపోగా సంక్షోభం మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం మూడో ప్రపంచ దేశాలన్నింటినీ ఆవరించింది. ఈ పరిస్థితిలో ఆ దేశాలపై తమ పట్టును మరింతగా బిగించడానికి సామ్రాజ్యవాదులు కొత్త వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు. లెబనాన్ పరిణామాలు దీనినే సూచిస్తున్నాయి. ఈ వ్యూహంలో మొదటి అంశం-సంక్షోభ దుస్థితికి కారణం రాజకీయ నాయకుల, ప్రభుత్వాల అవినీతి అని చెప్పడం ద్వారా నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాల వైఫల్యం వైపు నుండి ప్రజల దృష్టిని మళ్ళించడం. పలు మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి వున్నందున ఈ వాదనకు కొంత బలం చేకూరుతుంది.
సంక్షోభంతో దెబ్బ తిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలను సహాయం పేరుతో మరింత గట్టిగా నయా ఉదారవాద విధానాలను అమలు చేసేలా లొంగదీయడం రెండవ అంశం. తక్షణ సహాయం పేరుతో రుణాలివ్వడం, ఆ రుణంతోబాటు మరిన్ని విషమ షరతులను విధించడం ఇందులో భాగం. ఏ నయా ఉదారవాద విధానాలు ఆ దేశాలను సంక్షోభం లోకి తెచ్చాయో, ఆ విధానాలనే మరింత లోతుగా అమలు చేసేట్టు చూడడం జరుగుతుంది.
ఈ విధానాలను అమలు చేసి ప్రజల్లో భ్రష్టు పట్టిపోయిన ప్రభుత్వం స్థానంలో తమకు అనుకూలంగా, మరింత లొంగి వుండే మరో నయా ఉదారవాద ప్రభుత్వాన్నే తెచ్చుకోవడం మూడవ అంశం. ఆ విధంగా నయా ఉదారవాద చట్రం నుండి బైటకు పోకుండా, తమ ఆధిపత్యం కొనసాగేలా సామ్రాజ్యవాదం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో మూడో ప్రపంచ దేశాలపై తమ పట్టును మరింత పెంచుకోవాలన్నదే సామ్రాజ్యవాదుల వ్యూహం.
ఈ వ్యూహం ప్రజల జీవన పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదలకూ దారితీయదు. అందువలన ఎక్కువ కాలం ఈ వ్యూహం పని చేయదు. కాని పెట్టుబడిదారీ విధానానికి దీర్ఘకాలంలో ఏం జరుగుతుందన్నది ఎప్పుడూ పట్టదు. తక్షణం తన పెత్తనానికి ఎటువంటి సవాలూ రాకుండా చూసుకోవడం మీదనే దాని దృష్టి అంతా ఉంటుంది. ఇక ప్రజల బాగోగులు దానికి ఎప్పుడూ పట్టవు.
* ప్రభాత్ పట్నాయక్










