లబ్ధిదారులందరూ గృహాలు నిర్మించుకోవాలి
- జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ గృహాలు నిర్మించుకుని సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెసి రాహుల్ కుమార్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, రాష్ట్ర హస్త కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని నూనెపల్లి హరిజనవాడ, విజయపురి కాలనీ, మూలసాగరం, షాదిక్ నగర్ తదితర ప్రాంతాల్లోని అర్హులైన 255 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ గృహాలు నిర్మించుకొని తన సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బొమ్మల సత్రం నుండి నూనెపల్లె వరకు రోడ్డుకిరువైపులా ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే పిల్లలందరినీ బాగా చదివించి పేదరికం నుండి బయట పడాలని కోరారు. ప్రభుత్వ ప్రవేశపెట్టిన నాడు-నేడు, అమ్మబడి తదితర సంక్షేమ కార్యక్రమాల ఫలాల లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నంద్యాల జిల్లా అయిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతోందని, కొత్త కొత్త పరిశ్రమలు కూడా జిల్లాలో నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని వివరించారు. నంద్యాల ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతర అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తోందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో పాటు నివసించే కాలనీకి జగనన్న కాలనీ నామకరణం చేస్తున్నామన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాల పట్టాలను అందజేస్తున్న జెసి, ఎంపీ, ఎమ్మెల్యే, చైర్మన్ తదితరులు










