Jun 22,2023 01:02
మార్టూరు జగనన్న లేఅవుట్లో పర్యటిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సత్వరం చేరేలా అధికారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు. మండల కేంద్రం మార్టూరు గన్నవరం రోడ్డులోని జగనన్న లే అవుట్‌లో నిర్మాణాలు జరుపుకున్న 550 ప్లాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఏమన్న సమస్యలు ఎదుర్కొంటున్నారా.... అని ఆరా తీశారు. కాలనీలో డ్రైనేజీ, విద్యుత్‌, నీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ దృష్టికి కాలనీవాసులు తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్‌ యుద్ధప్రాతిపదికన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డ్వాక్రా గ్రూప్‌ల ద్వారా మంజూరైన రూ.35 వేల రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొదటగా ఇసుకదర్శి గ్రామంలో రూ.1.60 లక్షల నిధులతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నాడు -నేడు పథకం ద్వారా నిర్మాణం జరుపుకుంటున్న 7వ తరగతి గదులు, ప్రహరీ గోడలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్‌ స్వయంగా తిని పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్‌ పదో తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రంలో సమస్యలు పరిష్కరించే మెళకువలు నేర్పించారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 27 మంది విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పురస్కారాలు అందుకోవాలని సూచించారు. అనంతరం మార్టూరులోని జగనన్న కాలనీ లే అవుట్‌, సచివాలయం-3, సుగాలి తండాలోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి ఉద్యోగులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ రవీందర్‌, డిసీడీఓ సువార్తమ్మ, స్థానిక తహశీల్దార్‌ బత్తుల వెంకటరెడ్డి, ఎంపిడిఓ తోట కృష్ణకుమారి, హౌసింగ్‌, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.