ప్రజాశక్తి-కశింకోట
సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందించేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. మండలంలోని ఏనుగు తుని, చిన్న ఏనుగుతుని గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. అర్హత గలవారికి ప్రభుత్వ పథకాల అందుతున్నాయా? లేదా? అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏనుగు తునిలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కశింకోట, అనకాపల్లి ఎంపీపీలు కలగా లక్ష్మి గున్నయ్య నాయుడు, గొర్లి సూరిబాబు, జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్ రాజు, వైస్ ఎంపీపీ నమ్మి మీనా గణేష్, వైసిపి నాయకులు మళ్ళ బుల్లి బాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, మలసాల కిషోర్, పలకా రవి, ఏనుగు తుని సర్పంచ్ నాగమణి, అందే రమణ పాల్గొన్నారు.
కె.కోటపాడు : వైసిపి ప్రభుత్వ హయాంలోనే శివారు గ్రామాలు అభివృద్ధి చెందు తున్నాయని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. ఆదివారం చౌడువాడ శివారు పాచిలవానిపాలెం, బంటువాని కల్లాలులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.19 లక్షలతో నిర్మించిన పదివేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకును ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు, సీసీ రోడ్లకు రూ.24.78 లక్షలు, కాలువలకు రూ.3.84 లక్షలు కేటాయించారు. నాడు నేడు పథకం కింద పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఎంపీడీవో కె.శచిదేవి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










