Aug 12,2022 00:21

మానవతపై దాడి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న బివి.రాఘవులు, నర్సింగరావు, లోకనాథం, జగ్గునాయుడు తదితరులు

ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి
దేశాన్ని ఐక్యంగా ఉంచగలిగిన ఫెడరలిజం, లౌకికవాదాన్ని దెబ్బతీయాలని బిజెపి చూస్తోందని, దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పద్మ అధ్యక్షతన 'భారత స్వాతంత్య్రోద్యమం - కమ్యూనిస్టుల త్యాగాలు - నేటి పరిస్థితులు'పై జరిగిన జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులు రాజ్యాంగ లక్ష్యాలను పరిరక్షించుకొనేందుకు విశాల ఐక్యతను నిర్మించడంలో ముందుండాలన్నారు. మోడీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలకు భద్రత కొరవడిందని తెలిపారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం పూర్తిగా నాశనం చేస్తోందని అన్నారు. వాక్‌స్వాతంత్య్రాన్ని దెబ్బతీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. బిజెపి మతోన్మాదంతో దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు. స్వాతంత్య్రోద్యమం నిజమైన వారసులం తామేనన్నట్టు చిత్రీకరించుకునేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, విప్లవకారులు, గదర్‌ వీరులు, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ వంటి అనేక మంది స్వాతంత్య్రోద్యమం గురించి పోరాటం చేస్తుంటే, ఆర్‌ఎస్‌ఎస్‌ నాటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఊడిగం చేసిందన్నారు. కేంద్రంలో తన అధికారాన్ని వినియోగించుకుని మోసపూరిత ప్రచారంతో బిజెపి ప్రజలను నమ్మించాలని చూస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలతో విసిగి అసంతృప్తిలో ఉన్న ప్రజలను 2024 ఎన్నికల నాటికి సానుకూలంగా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి లొంగిపోయిన సావర్కర్‌ను గాంధీకి మించిన దేశభక్తునిగా ప్రచారం చేయడానికి పూనుకోవడం సిగ్గు చేటన్నారు. సిఎఎ, వ్యవసాయ చట్టాలను పోరాడి తిప్పికొట్టినట్లే బిజెపి మతోన్మాద ప్రమాదానికి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువతను సమీకరించి కమ్యూనిస్టులు ఉద్యమాలను నిర్మించాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమం సుదీర్ఘంగా నిర్వహించిన ఫలితంగానే ప్రయివేటీకరణ జరగలేదన్నారు. ఉక్కు కార్మికుల పోరాటం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వాన జమీందారి వ్యతిరేక పోరాటం, గిరిజన ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు. ఉత్తరాంధ్రలో అనేక పోరాటాలు జరిగాయన్నారు. విశాఖ ఉక్కు సాధన ఉద్యమంలోనూ కమ్యూనిస్టుల పాత్ర అమోఘమన్నారు. ఒడిదుడుకులను అధిగమించి కమ్యూనిస్టుల పోరాటాలు ముందుకుసాగుతాయన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ వారసత్వంతో ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్మించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్యదర్శివర్గసభ్యులు బొట్టా ఈశ్వరమ్మ, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కోశాధికారి విఎస్‌.పద్మనాభరాజు తదితరులు పాల్గొన్నారు. సభా వేదికపై 'మానవతపై దాడి' పుస్తకాన్ని రాఘవులు ఆవిష్కరించారు.