స్వాతంత్య్ర వేడుకల్లో వక్తల పిలుపు - సిపిఎం, వివిధ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా నిర్వహణ
ప్రజాశక్తి - ఏలూరు
లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే స్వాతంత్య్ర సమరయోధులకు మనమిచ్చే నివాళి అని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏలూరులోని సిపిఎం కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని కిషోర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహానుబావులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. గాంధీ, సర్దార్ వల్లభారు పటేల్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్, పుచ్చలపల్లి సుందరయ్య, లక్ష్మీ సెగల్ వంటి యోధాని యోధులు ఉన్నారని తెలిపారు. వారంతా దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు సిద్ధించే సోషలిస్టు వ్యవస్థ రావాలని కోరుకున్నారని, కానీ ప్రజల మధ్య అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి వంటి మతోన్మాద శక్తులు హిందూ, ముస్లిము, క్రైస్తవులు అంటూ ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం దేశభక్తి పేరు చెబుతూ, దేశంలో దళితులు, గిరిజనులు, క్రైస్తవుల, ముస్లిము మహిళల పట్ల అమానుషంగా మతోన్మాద శక్తులు ప్రవర్తిస్తున్నాయన్నారు. దేశంలో మతోన్మాద శక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.సోమయ్య, కె.రామాంజనేయులు, వివిఎన్.ప్రసాద్, వి.సాయిబాబు, బి.జగన్నాధరావు, జెవివి నాయకులు ఎస్‌ఎన్.రమేష్, ఐద్వా నాయకులు పి.హైమావతి, వి.శైలజ పాల్గొన్నారు.
సిఐటియు జిల్లా కార్యాలయంలో..
భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం నేటి భారతీయుల కర్తవ్యమని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు అన్నారు. స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిర్ణయాల వల్ల దేశ రాజ్యాంగానికి ప్రమాదం ముంచుకొచ్చిందని, రక్షించుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. మణిపూర్ మారణ హోమం, 370 ఆర్టికల్ రద్దు, చట్టాల స్థానంలో లేబర్ కోడ్లు తీసుకురావడం, రాష్ట్రాల హక్కులు హరించడం, రాజ్యాంగ వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుని దుర్వినియోగం చేయడం, మహిళలు, మైనారిటీలు, దళిత, గిరిజనులపై దాడులు సర్వసాధారణమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ఐక్యంగా ఉండాలంటే బిజెపిని తరిమికొట్టాలని ఇండియా కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, కె.విజయలక్ష్మి, కె.పోచమ్మ, వి.సాయిబాబు, సురేష్ పాల్గొన్నారు
ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం ఆశ్వర్యంలో..
ఏలూరు : దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడిన మహనీయుల ఆశయాలను సదా గమనంలో ఉంచుకుని దేశ ఐక్యతను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరు పాటుపడాలని ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వాహక కమిటీ సభ్యులు రత్నాకర్‌రావు అన్నారు. పవర్‌పేటలోని అన్నే భవనం వద్ద స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. జాతీయ జెండాను రత్నాకర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎవిఆర్ విజ్ఞానకేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు స్వాగతం పలికి అధ్యక్షత వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం రత్నాకర్‌రావు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజలకు స్వేచ్ఛ అంశంలో భారతీయ స్థానం ప్రతిఏటా దిగజారుతోందని, జీవన విధానంలోనూ వెనుకబాటు కనపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై దాడులు, దౌర్జన్యాలు సాగుతున్నా స్వాతంత్య్ర పోరాట యోధుల స్ఫూర్తితో ప్రశ్నించడం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్డ్ లెక్చరర్ పి.ఆంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధన కోసం ఎందరో మహనీయులు ప్రాణాలను, ఆస్తులను, జీవితాలను ఫణంగా పెట్టి పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పి కిషోర్, కె.శ్రీనివాస్, విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు పి.హైమావతి, కె.రాజ్యలక్ష్మి, జి.రవీంద్ర, పి.ప్రసాద్, వివిధ సంఘాల నాయకులు వివివి.ప్రసాద్, జి.గోపి, ఎం.ఇసాక్, హెలాపురి బాలోత్సవం ట్యూషన్ సెంటర్స్ విద్యార్థులు పాల్గొన్నారు
నూజివీడు : సిపిఎం నూజివీడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ ఆవరణలో స్వాతత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు ఏలినేని దుర్గారావు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జి.రాజు, ఐద్వా, ఐలు నాయకురాలు నండూరి పద్మాంజలి, నూజివీడు సెల్ ఫోన్ షాపుల యూనియన్ నాయకులు సతీష్, ఇతర కార్మికులు పాల్గొన్నారు.
నిడమర్రు : సిపిఎం, సిఐటియు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భువనపల్లి, నిడమర్రు ప్రజాసంఘాల కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో విఆర్‌ఎల సంఘం నాయకులు ఎస్.మోహన్‌రావు, కోన శ్రీనివాసరావు, సత్యనారాయణ, హరి కుమారి, వెలగలేటి మోహన్, కంచం వరప్రసాద్, ఎం.బాపిరాజు, దేవుని విజయలక్ష్మి, తులసీరామ్, వానపల్లి శేషగిరి పాల్గొన్నారు.
చాట్రాయి : మండల కేంద్రం చాట్రాయిలో సిపిఎం మండల కార్యదర్శి పి.భాస్కరరావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలవరంలో పార్టీ నాయకులు చాగంటి రాజారావు జెండావందనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద రిటైర్డ్ సైనికుడు బి.సాల్మన్‌రాజు జెండా ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదువుతూ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంకోసం కమ్యూనిస్టులు మాత్రమే పోరాడుతున్నారన్నారు. స్వతంత్య్ర పోరాటంలో భాగస్వామ్యం లేని వ్యక్తులు దేశాన్ని పాలిస్తూ దేశభక్తి కోసం మాట్లాడుతుంటే ఎంతో ఆవేదన చెందాల్సి వస్తుందన్నారు. సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు మాట్లాడుతూ దేశంలో మతతత్వ పార్టీలను పారదోలి సమైక్యవాదులను గద్దినెక్కించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు ఎన్‌వి.అప్పారావు, సీతారామయ్య, కొండల రావు, ఐద్వా మండల కార్యదర్శి నెలటూరి నిర్మల, భగత్ సింగ్, సుందరయ్య కాలనీ నాయకులు కెచ్చల రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : బుట్టాయగూడెంలో సిపిఎం ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలోజు నాగేశ్వరరావు, మొడియం నాగమణి, గిరిజనులు పాల్గొన్నారు.
చింతలపూడి : పదేళ్లుగా దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టి బిజెపి పాలన సాగిస్తుందని సిపిఎం చింతలపూడి కార్యదర్శి ఎస్.సూర్యకుమార్ అన్నారు. డిఎన్.రావుపేట చర్చి ప్రాంగణంలో రెవఫా భానుప్రసాద్ జెండా ఆవిష్కరించారు.
కలిదిండి : ప్రజా సంఘాలు, సిపిఎం ఆధ్వర్యంలో కలిదిండి ప్రధాన సెంటర్‌లోని రిక్షాస్టాండ్ వద్ద స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి ఎస్.మహంకాళిరావు జాతీయజెండా ఎగురవేశారు. దండుబోయిన త్రిమూర్తులు, బిల్డింగ్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పోతురాజు బాలాజీ, పరసా రాజేష్, అక్బర్, జాఫర్ వలీ, పి.గోపి, గూడవల్లి శ్రీనివాసరావు, దాసు, రిక్షా, ముఠా కార్మికులు పాల్గొన్నారు.
ముదినేపల్లి : మండలంలోని వణుదుర్రు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిన్నం మాధవ పాల్గొన్నారు.
నూజివీడు రూరల్ : నూజివీడు పట్టణంలో సిపిఎం కార్యాలయం వద్ద, 10, 15, 21వ వార్డుల్లో సిపిఎం నేతలు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో సిపిఎం నేత జివిఎస్.రాజు మాట్లాడుతూ ఎందరో మహానుబావుల త్యాగ త్యాగఫలం స్వాతంత్య్రం అని అన్నారు. ప్రతిఒక్కరూ దేశాభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్‌ఆర్.హనుమాన్లు, మల్లేశ్వరరావు, కేశవ, శోభనాద్రి, పి.కమల, ఎన్.పద్మాంజలి, ఇ.దుర్గారావు పాల్గొన్నారు.










