Jan 26,2022 07:18

ప్రస్తుత బి.జె.పి ప్రభుత్వం ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తన రాజకీయ ప్రాబల్యాన్ని కొనసాగించ టానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు, కార్మికులు, ఉద్యోగులు ఉపాధ్యాయులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి.

   నవరి 26 గణతంత్ర దినోత్సవం నాటికి భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చి 72 ఏళ్లు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ నాయకత్వాన ముసాయిదా కమిటీ అరవైకి పైగా రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారతీయ భిన్నత్వానికి, బహుళత్వానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను పొందుపరచారు. ''భారతదేశ ప్రజలమైన మేము భారత దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా'' ప్రకటించుకున్నాము.
    రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులను, 4వ భాగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరచారు. గిరిజన ప్రాంతాలకు 5,6 షెడ్యూళ్ల ద్వారా ప్రత్యేక హక్కులు కల్పించారు. జమ్ము-కాశ్మీర్‌ ఆనాడు ప్రత్యేక పరిస్థితులలో ఇండియన్‌ యూనియన్‌లో చేరటంతో 370వ నిబంధన ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. తరతరాలుగా అణచివేతకు గురైన షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు, వెనుకబడిన తరగతుల ప్రజల కోసం రాజ్యాంగం 16వ భాగంలో రిజర్వేషన్లతో పాటు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించారు.
 

                                                        భారతీయ ఉమ్మడి సంస్కృతి

భారతీయ సంస్కృతి ఉమ్మడి సంస్కృతి అని రాజ్యాంగంలోని 51(ఎ) నిబంధనలో పేర్కొన్నారు. భారతదేశం భిన్న మతాలకు, సాంప్రదాయాలకు, సంస్కృతులకు, ఆచారాలకు నెలవుగా ఉన్నది. దేశంలో హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, జైనం, బౌద్ధం, పార్సీ, సిక్కు మతాలతో కూడిన సంస్కృతీ సాంప్రదాయలు ఉమ్మడి సంస్కృతిగా రూపుదిద్దుకున్నాయి. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు ''విభజించు-పాలించు'' సూత్రంలో భాగంగా హిందువులు-ముస్లింల మధ్య మతతత్వ భావనలు రెచ్చగొట్టారు. ఫలితంగానే జాతీయోద్యమ కాలంలో ముస్లిం లీగ్‌, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. మతతత్వ ధోరణులకు కొనసాగింపుగానే 1947లో దేశ విభజన జరిగింది. సమకాలీన భారతదేశంలో మతతత్వ ధోరణులను, మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలను మతపరంగా చీల్చటానికి సంఘ పరివార్‌, బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటన్నింటిని ఎదుర్కొని భారతీయ ఉమ్మడి సంస్కృతిని రాజ్యాంగంలో చెప్పిన విధంగా పరిరక్షించుకోవాలి.
 

                                                      రాజ్యాంగంలో లౌకిక విధానాలు

భారత రాజ్యాంగం దేశాన్ని లౌకికరాజ్యంగా ప్రకటించింది. ఈ మేరకు పీఠికలో చేర్చారు. ప్రాథమిక హక్కులలో 25 నుండి 28 వరకు గల నిబంధనలు ప్రజలకు మత స్వేచ్ఛను కల్పించాయి. ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని ''స్వీకరించటానికి, ఆచరించటానికి, ప్రచారం చేసుకోవటానికి'' హక్కు కలిగి ఉన్నాడు. మతపరమైన సంస్థలను నిర్వహించుకోవటానికి, సేవా కార్యక్రమాలు నిర్వహించటానికి రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. వ్యక్తిగతమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చని చెప్పింది. ప్రాథమిక హక్కులలో విద్యా, సాంస్కృతిక హక్కులను 29, 30 నిబంధనలలో పేర్కొని వాటి ద్వారా మైనారిటీలు తమ భాషను, సంస్కృతిని, విద్యను అభివృద్ధి చేసుకోవటానికి విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం పేర్కొన్నది. రాజ్యాంగ నిర్మాతల ప్రధాన లక్ష్యం భారతదేశం లోని భిన్న మతాల ప్రజలు లౌకిక విధానాలతో జీవిస్తూ సహజీవనం చేయాలని భావించారు. లౌకిక విధానాల ద్వారానే దేశ సమైక్యత, సమగ్రత కొనసాగుతుందని భావించారు.
 

                                                         బిజెపి మతతత్వ విధానాలు

దేశంలో హిందూత్వ విధానాలను అమలు చేయటంతో పాటు హిందూ రాజ్యం ఏర్పడాలని, హిందూ ఆధిక్యత కొనసాగాలని ఆర్‌.ఎస్‌.ఎస్‌ సిద్ధాంత భావజాలంలో స్పష్టంగా పేర్కొన్నది. ఈ భావజాలాన్ని అమలు చేయటానికి సంఘపరివార్‌తో పాటు రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఆలంబనగా చేసుకున్నది. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం లోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం గత 8 ఏళ్లగా మతోన్మాదాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బిజెపి అధికారం లోకి వచ్చాక ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావజాలంతో హిందూత్వ శక్తులు విజృంభిస్తున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొడుతూ మైనారిటీల పైన, దళితుల పైన దాడులు చేస్తున్నారు. భారతదేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరిస్తూ అఖండ భారత్‌ స్థాపన కోసం ప్రజలు ముందుకు రావాలని రెచ్చగొడుతున్నారు.
    రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రసంగాలు చేస్తున్నారు. ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌ సమావేశాలలో హిందూత్వ శక్తులు మైనారిటీలను ఊచకోత కోయాలని ప్రసంగాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో నరేంద్ర మోడీ-యోగిల ద్వయం చేపడుతున్న చర్యలు మైనారిటీలలో భయానక వాతావరణాన్ని సృష్టించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశాలలో భారతీయ జనతా పార్టీ మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టటానికి, మతపరమైన చీలికలు తేవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నది. జనవరి 26న జరగబోయే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బిజెపి అనుకూల రాష్ట్రాల శకటాలను అనుమతించి, బెంగాల్‌, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మొదలగు రాష్ట్రాల శకటాలను అనుమతించక పోవటం వివక్షతలో భాగమే.
    2019లో నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత మూడేళ్లుగా చేస్తున్న నిర్ణయాల ద్వారా ప్రజల మధ్య మతపరమైన అగాధాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నారు. జమ్ము-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ నిబంధనను రద్దు చేయటమేకాక, కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని కూడా రద్దు చేయటం దీనిలో భాగమే (ఇప్పుడు కార్పొరేట్లు కాశ్మీర్‌లో భూముల కోసం ఎగబడుతున్నారు). అంతేకాకుండా పౌరసత్వ అంశాన్ని ముందుకు తెచ్చి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చేయడం, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) మొదలగు వాటిని ప్రతిపాదించటం మతపరమైన భావాలను రెచ్చగొట్టడంలో భాగమే. పైఅంశాలన్నీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.
 

                                                    ఎ.పి లో మతతత్వ శక్తుల కార్యకలాపాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి మతతత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో భజన సంఘాలు, పండగలు, ఉత్సవాల పేరుతో తమ భావజాల వ్యాప్తికి ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చాలని, కూల్చివేయాలని ప్రచారం ప్రారంభించారు. హిందూ ఐక్యవేదిక పేరుతో ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. విశాఖపట్నంలో కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ పేరు మార్చాలని పిలుపు ఇచ్చారు. ఆత్మకూరులో మసీదు అంశాన్ని బిజెపి నాయకులు వివాదంగా మార్చి ఘర్షణకు దిగారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ప్రతిష్టాపనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ చేశారు. శ్రీశైలంలో దుకాణాలు పెట్టుకున్న ముస్లింలపై దాడులు చేశారు.
    ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన చట్ట హామీలు అమలు జరపలేదు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు పూనుకున్నది. ప్రజలలో వీటిపై చర్చ లేకుండా మతోన్మాద భావల వైపు మళ్లించాలన్నది బి.జె.పి ఆలోచనా విధానం. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీగాని, ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేనగాని బి.జె.పి మతోన్మాద విధానాలను ఖండించటం లేదు.
    ప్రస్తుత బి.జె.పి ప్రభుత్వం ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తన రాజకీయ ప్రాబల్యాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు, కార్మికులు, ఉద్యోగులు ఉపాధ్యాయులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి.
 

/ వ్యాసకర్త : శాసనమండలి సభ్యులు,
లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌,
సెల్‌ : 94402 62072 /
కె.యస్‌. లక్ష్మణరావు

కె.యస్‌. లక్ష్మణరావు