
ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్: మచిలీపట్నంలో సిరి కళ్యాణ మండపం నందు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ జిల్లా స్థాయి అవగాహన సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ అపరాజితా సింగ్ పాల్గొని మాట్లాడుతూ పాడి రైతులకు పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా గొర్రెలు, మేకల పెంపకం యూనిట్, కోళ్లు ఫారం యూనిట్, దేశీయ ఆవుల యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 2022- 26 కాల పరిమితితో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ పథకంలో గొర్రెలు మేకల పెంపకం పశుగ్రాసం, దానా తయారీలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల పాటించడం ద్వారా అసంఘటితంగా ఉన్న పశుసంవర్ధక రంగాన్ని వ్యవస్థ రంగంలోనికి తీసుకువచ్చి పాలు ,గుడ్లు, మాంసం ఉత్పత్తిని పెంచి వాటికి ఆన్లైన్ విధానం ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలను గ్రామస్థాయిలో నుండి జిల్లా స్థాయి వరకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడమైన లక్ష్యంగా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. పాడి రైతులకు మేలు కలిగించే విధంగా గొర్రెలు మరియు మేకల యూనిట్కు కనిష్టంగా 10 లక్షల నుంచి 50 లక్షల వరకు బ్యాంకు లింకేజీ తో కూడిన ప్రాజెక్టు విలువలో గరిష్టంగా 25 లక్షలు లేదా ప్రాజెక్టు విలువలో 50 శాతం ప్రభుత్వం రాయితీ అందిస్తుంది. వాటిలో రైతులు కావలసిన యూనిట్ను ఏర్పాటు చేసుకోదలచిన సమయంలో బ్యాంకు వారు మొదటి దశ రుణాన్ని లబ్ధిదారునికి అందిస్తారు తర్వాత మొదటి దఫా సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకుకి జమ చేయడం జరుగుతుందన్నారు.ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అధికారులు ధ్రువీకరించిన పిదప రెండవ దఫా సబ్సిడీ మొత్తాన్ని కూడా బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో బొర్రా విఠల్,జె డి అర్ రత్నకుమారి, డా.శ్రీనివాసరావు, డా.పి నాగభూషణబాబు, డా.సి శ్రీనివాస్ ఎం వెంకటేశ్వరారావు, డా.టి సాయి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.