
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
ప్రజాశక్తి - తణుకు
రాష్ట్రంలోని గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ల పెంపకం దారులందరూ జాతీయ లైవ్ స్టాక్ మిషన్‌ను వినియోగించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక నెక్ కళ్యాణ మండపంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని రైతులందరికీ ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ మిషన్ ఉపయోగించుకుని ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవాలని, అన్ని బ్యాంకులూ వారికి రుణాలు మంజూరు చేయాలని కోరారు. రైతులందరినీ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ 50 శాతం సబ్సిడీ రుణాలను వినియోగించుకోవాలని, దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా తగిన వివరాలు పొందాలని కోరారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎ.నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకుల ద్వారా రైతులకు సబ్సిడీపై రుణాలు అందిస్తామన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక సంచాలకులు డాక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ మిషన్ ద్వారా అందించే కార్యక్రమాలకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది సహకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం ఉపసంచాలకులు డాక్టర్ ఎల్‌కె.సుధాకర్, భీమవరం ఉపసంచాలకులు డాక్టర్ జోహార్ హుస్సేన్, నెక్ అధ్యక్షులు గంగాధర్, పౌల్ట్రీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు కెవి.సుబ్బారావు పాల్గొన్నారు.