Nov 01,2021 09:28

తీరంలో గవ్వల నేరుకుని
మురిసే నయనం
నా జీవితం

నీలి సముద్రాల్లో
కన్నీటి నావల ఆనవాలు

నా మరణ వాంగ్మూలం

నాకుగా నిలవడానికి
తెగిపడిన క్షణాలన్నీ
కళని కోల్పోయిన నక్షత్రాలు

కాంతిలేని స్వప్నంలో
కటిక చీకటి దృశ్యాలని వర్ణించే
కళేదీ నా వద్ద లేదు

కానీ..
తప్పిపోయి తిరిగే
పక్షిపిల్లల పాదముద్రల్ని
తల్లితనంతో రాయగలను
నీటి బుడగల్లో
ఆఖరిశ్వాసల్ని చదవగలను
కొంగల గుంపుల్లో తెల్లటి ఊహను చూడగలను

అయినా,
మిగులపండిన
సూర్యుడి అవస్త నాది
అస్తమించకా మానను
ఉదయించకా మానను

వెన్నెల్ని కని పారిపోలేని చంద్రుడి తపన నాది
చీకటి గంధాలను
మెడకు పూసుకు తిరిగే
అమావాస్య తత్వం నాది
మరి, నువ్వు ఏమిటనే ఆదిమ ప్రశ్న,
నేను వెయ్యలేను
 

అనురాధ బండి
82470 39259