లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు పెట్టాలని ధర్నా
ప్రజాశక్తి -రంపచోడవరం
మండలంలోని కాకవాడ గిరిజన సంక్షమ ఆశ్రమ బాలికల పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన హెచ్‌ఎం భర్త ప్రసాద్‌పై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ స్థానిక ఐ.టి.డి.ఎ కార్యాలయం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యాన గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు మాట్లాడుతూ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కాకవాడ పాఠశాలలో హెచ్‌ఎం భర్త తానే హెచ్‌ఎంగా వ్యవహరించటం, పాఠశాల లో లైంగిక వేధింపులకు పాల్పడటం, అమానుషంగా విద్యార్థులపై ప్రవర్తించడం, మెనూ సక్రమంగా అమలు చేయక పోవడం దారుణమన్నారు. గిరిజన సంఘాలను అనుమతించక పోవడం వల్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. నిందితులను కఠినంగా శిక్షించక పోతే ఇలాంటి దారుణాలు మరిన్ని పునరావృతం అవుతాయని పేర్కొన్నారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇ.సిరిమల్లి రెడ్డి, నాయకులు ఎ.ధర్మారెడ్డి, అమ్మిరాజు, రమాదేవి, శ్రీదేవి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె. శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.










