Aug 04,2021 08:15

న్యూయార్క్‌ : న్యూయార్క్‌ గవర్నర్‌ అండ్రూ క్యూమోపై వచ్చిన లైంగిక ఆరోపణలు వాస్తమేనని  అటార్నీ జనరల్‌ లిటిషియా జేమ్స్‌ మంగళవారం ప్రకటించారు. ఆయనపై చేపట్టిన విచారణలో పలుసార్లు ఇప్పుడు, మాజీ ప్రభుత్వ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించాడని తేలిందని చెప్పారు. ఐదు నెలల పాటు సాగిన దర్యాప్తులో ఇద్దరు న్యాయవాదులు 179 మందిని ప్రశ్నించగా... విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. క్యుమో పరిపాలనలో భయానక, బెదిరింపులతో కూడిన పరిస్థితులు, ప్రతికూల వాతావరణం ఉన్నట్లు తెలిపారు. ఈ విచారణలో గవర్నర్‌తో క్రమం తప్పకుండా సంభాషించే ఉద్యోగులు, రాష్ట్ర భద్రతా బలగాలు, ఎగ్జిక్యూటివ్‌ చాంబర్స్‌ ప్రస్తుత, మాజీ సభ్యులు, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. ఈ మొత్తం విచారణలో కలవరపెట్టే అంశాలు బహిర్గతమయ్యాయని అటార్నీ జనరల్‌ అన్నారు. గవర్నర్‌ ప్రస్తుత, గత ప్రభుత్వ ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని చెప్పారు. కాగా, గవర్నర్‌పౖౖె ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిపై క్యుమో, ఆయన సీనియర్‌ సిబ్బంది ప్రతీకార చర్యలకు కూడా పాల్పడ్డాయని తేలిందని చెప్పారు. క్యుమో ప్రభుత్వేతర మహిళలను కూడా లైంగికంగా వేధించినట్లు విచారణరలో తేలిందని పేర్కొన్నారు.