Oct 13,2023 22:16

లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని... పటిష్టంగా అమలు చేస్తాం : కలెక్టర్‌

లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని...
పటిష్టంగా అమలు చేస్తాం : కలెక్టర్‌
ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల్లో అంతర్గత కమిటీలు

ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌
లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని, నెలాఖరుకల్లా టిటిడి, ప్రభుత్వ విభాగాల్లోనూ, నవంబర్‌ ఆఖరికల్లా ప్రైవేట్‌రంగాలలో అంతర్గత కమిటీలు పూర్తి చేస్తామని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి అన్నారు. సిఐటియు చొరవతో కలెక్టరేట్‌లో శుక్రవారం లైంగిక వేధింపుల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం అన్ని విభాగాల అధికారులతో కలెక్టర్‌ ఆద్వర్యంలో నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయంతి, సాయిలక్ష్మి, సిఐటియు నేతలు వాణీశ్రీ, బుజ్జి, హేమలత ప్రసంగించారు. జిల్లాలోని 82 విభాగాల్లో అంతర్గత కమిటీల ఊసేలేదని, ఈ కారణంగా శ్రామిక మహిళలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. జిల్లాలో పలుచోట్ల మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనను సోదాహరణంగా వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులను ఎదుర్కోడానికి లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013ను పటిష్టంగా అమలు చేస్తామన్నారు. అక్టోబర్‌ చివరి నాటికి టీటీడీ, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంతో సహా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జయలక్ష్మిని కలెక్టర్‌ ఆదేశించారు. శ్రామిక మహిళలు లైంగిక వేధింపులకు గురికాని జిల్లాగా తిరుపతి జిల్లాను మార్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. తాను ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసినపుడు ఓ మండల స్థాయి అధికారిపై ఫిర్యాదు వచ్చిందని అంతర్గత కమిటీలు, స్థానిక కమిటీ లేకపోవడం వల్ల ఆ అధికారి చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని, శిక్ష నుంచి తప్పించుకున్నాడని వివరించారు. తిరుపతి జిల్లాలో తప్పు చేసిన వారు అలా తప్పించుకోవడానికి వీల్లేని పద్ధతులను నిర్దేశిద్దామని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. తన సర్వీసులో ఎదురైన అనేక ఇబ్బందులను వాటిపట్ల తాను వ్యవహరించిన తీరును కలెక్టర్‌ అధికారులకు వివరించారు. చట్టం పటిష్టంగా అమలు జరగకపోతే బాధితులకు న్యాయం జరగదని, చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం స్థానిక కమిటీలను, అంతర్గత కమిటీలను బలోపేతం చేస్తామని అందుకు జిల్లాలోని అధికారులు అన్ని విభాగాల వారు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నవంబర్‌ నెలలో అన్ని షాపింగ్‌ మాల్స్‌ లో, పరిశ్రమలలో, ప్రైవేటు విభాగాలలో 10 మందికి మించి శ్రామిక మహిళలు పనిచేస్తున్న అన్ని రంగాలలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. నవంబర్‌ నెల తర్వాత ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తామని, అంతర్గత కమిటీలు లేకుంటే కఠినంగా శిక్షించడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.