ప్రజాశక్తి - గుంటూరు లీగల్ : చిన్నారిపై జరిగిన లైంగిక దాడి యత్నం కేసులో ముద్దాయికి ఏడేళ్లు జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2017 ఏప్రిల్ 2న పొన్నూరు మండలం చింతలపూడిలో తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకు చర్చిలో ప్రార్థనకు వెళ్లగా, వారి కుమార్తె ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఆదే గ్రామానికి చెందిన దాసరి కోటేశ్వరరావు అలియాస్ కోటయ్య చిన్నారిని బలవంతంగా తన ఇంటిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. దీంతో నిందితుడు పరారైయ్యాడు. చుట్టుపక్కల వారు జరిగిన విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి రాంబాబు కేసును దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. కోర్టు మానిటరింగ్ సిబ్బందిని, కోర్టు కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అభినందించారు.










