ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అత్యాచారం కేసులో ముద్దాయికి గుంటూరు ఫోక్సో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణంలోని పిల్లలగడ్డ కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన షేక్ నాగూర్‌వలి ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు తన తల్లిదండ్రుల సాయంతో ఈ ఏడాది జులైలో పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి పిడుగురాళ్ల పట్టణ సిఐగా పనిచేస్తున్న ఎం.హనుమంత రావు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణ క్రమంలో నేర రుజువు కావడంతో నాగుర్‌వలికి జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు జడ్జి కె.ఎస్ రామకృష్ణారావు సోమవారం తీర్పునిచ్చారు. బాధిత బాలిక తరపున కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామల వాదించారు. కేసు దర్యాప్తు, ఆధారాల సేకరణలో ప్రతిభ చూపిన పోలీసులను పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి అభినందించారు.










