
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎక్కాల్సిన రైలు కాకుండా పోరుబాటున మరో రైలు ఎక్కి బాష తెలియక ఏం చేయాలో పాలుపోక గురజాల రైల్వే స్టేషన్‌లో దిగిన మహిళ లైంగిక దాడికి గురైంది. గతేడాది ఏప్రిల్ 15న జరిగిన ఈ ఘటన మరుసటి రోజు వెలుగులోకి రాగా తాజాగా ఈ కేసులో ఇద్దరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గుంటూరు 5వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కె.నీలిమ గురువారం తీర్పును వెలువరించారు. ఈ వేరకు వివరాలను నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి వెల్లడించారు.
ఒక మహిళ తన మూడేళ్ల కొడుకుతో గతేడాది ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని అత్త ఇంటి వద్ద నుండి మధ్యప్రదేశ్‌లోని తన పుట్టింటికి వెళ్తూ దారి తప్పి వెళ్ళాల్సిన రైలు ఎక్కకుండా వేరొక రైలు ఎక్కి 15వ తేదీన రాత్రి గురజాల రైల్వే స్టేషన్‌లో దిగారు. అప్పటికే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న దుండగులైన కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన కండ్రకొండ సుబ్బారావు, గురజాలకు చెందిన మాదిరాజు ప్రసాద్ కలిసి ఆకలితో ఉన్న భాదిత మహిళకు ఆహారం ఆశ చూపి గురజాల ఇష్టకామేశ్వరి గుడి వెనుకకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. బాధిత మహిళ గురజాల రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై స్పృహతప్పి రక్తపు మడుగులో పడిపోయి ఉండడాన్ని గమనించిన రైల్వే పోలీసులు 16న గురజాలలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు బదిలీలు అయిన సందర్భంగా నరసరావుపేట దిశా డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు అమర్చడం వల్ల దుండగుల కదలికలు కనిపెట్టి వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో 24 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ వారు విచారణ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె.వెంకట్‌రెడ్డి వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరచిన దిశా డీఎస్పీ రవిచంద్ర, కోర్టు హెడ్‌కానిస్టేబుల్ టి.మాణిక్యాలరావు, పిపిలను ఎస్పీ అభినందించారు.
దీనిపై ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని, నరసరావుపేట, గురజాల, చిలకలూరిపేట, సత్తెనపల్లి మాచర్ల తదితర పట్టణాల్లో సిసి కెమెరాలు అమర్చామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సత్వరమే గుర్తిస్తామన్నారు. క్షణికావేశాలకు గురై జీవితాన్ని పాడుచేసుకోవద్దని, బాపట్ల జిల్లాలో ఇదే తరహాలో జరిగిన ఘటనలో కూడా ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష పడిందని చెప్పారు. అపరిత వ్యక్తులకు దూరంగా ఉండాలని మహిళలు, యువతులు, బాలికలకు సూచించారు. ప్రతి మహిళా దిశా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆపత్కాలంలో రక్షణ పొందాలని సూచించారు.