ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్ : లార్వా నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.జగన్నాథరావు.. వైద్య సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ఎన్‌జిఒ సమావేశ భవనంలో జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల హెల్త్ సూపర్‌వైజర్లకు ఆరోగ్య కార్యక్రమాలపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా దోమలు పునరుత్పత్తి చెందే స్థావరాలను గుర్తించి యాంటీ లార్వా టీమోఫాస్ పిచికారీ చేయించాలన్నారు. ఇంటిలో ఎసిఎం 5 శాతం పిచికారీ చేయించాలన్నారు. ఫీవర్ సర్వే పూర్తి స్థాయిలో చేపట్టి, జ్వర లక్షణాలు గుర్తిస్తే వెంటనే మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసి, చికిత్స ఇవ్వాలన్నారు. ఇప్పటికే అన్ని ఆరోగ్య కేంద్రాలకు టెస్ట్ కిట్లు పంపిణీ చేశామన్నారు. డ్రై డే కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలన్నారు. వసతిగృహాలను తరచుగా సందర్శించి, సిక్ రూమ్‌లో ఉన్న విద్యార్థులకు చికిత్స, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఈ నెల 7 నుండి 12వ తేదీ వరకు నిర్వహించే మొదటి దశ మిషన్ ఇంద్రధనుష్ టీకాల కార్యక్రమానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. సర్వేలో గుర్తించిన అర్హులకు టీకాలు వేయించాలని, ముందుగా వీరందరినీ యూవిన్ పోర్టల్ లో నమోదు త్వరగా పూర్తిచేయాలన్నారు.
ఈ నెల 10న నిర్వహించే డీవార్మింగ్ (నులి పురుగులు నివారణ) కార్యక్రమానికి సన్నాహక ఏర్పాట్లు గురించి వివరించారు. సమావేశంలో జిల్లా ఆర్‌బిఎస్‌కె అధికారి డాక్టర్ డి.భాస్కరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎ.శ్యామ్ కుమార్, ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ ఎం.నవీన్ కుమార్, జిల్లా మలేరియా కన్సల్టెంట్ రామచంద్ర, ఎఎంఒ సూర్యనారాయణ, డెమో సన్యాసిరావు, ఎస్‌ఒ శంకర్ పాల్గొన్నారు.










