ప్రజాశక్తి - పరవాడ
లారస్ యూనిట్-3లో సోమవారం జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని, చనిపోయిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని కోరుతూ ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన మంగళవారం లంకెలపాలెం జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా ప్రకటనలు చేసి తరువాత పట్టించుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటస్వామి, కనకారావు, రమణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
టిఎన్‌టియుసి నిరసన
అచ్యుతాపురం : లారస్ కంపెనీ మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని టిఎన్‌టియుసి జిల్లా కార్యదర్శి కొండబాబు, మత్స్యకార సంఘం నాయకుడు మెరుగు బాపు నాయుడు డిమాండ్ చేశారు. లారస్ కంపెనీ ప్రమాద సంఘటనపై పూడిమడక గ్రామంలో మంగళవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొవిరి బంగారయ్య, మల్లి పోలయ్య, మైలపల్లి ధనరాజ్, కొవిరి దుర్గారావు, ధోని ఎర్రయ్య, కంబాల రాజు, చోడిపల్లి గంగరాజు, ఎరిపల్లి శివకోదండరావు తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
అనకాపల్లి : లారస్ మతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి నాయకులు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమల్లో తరచు ప్రమాదాలు జరుగుతున్నా పరిశ్రమల శాఖ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణ కొరవడుతోందన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ జిల్లాలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు నాయుడు మల్లికార్జునరావు, బోయిన గోవిందు, మత్తుర్తి సూరిబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
లారస్ బాధిత కుటుంబాలకు బండారు పరామర్శ
పరవాడ : లారస్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం పరామర్శించి వారికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఎల్‌జి పాలిమర్స్ ప్రమాదంలో చనిపోయిన వారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించారని, ఇప్పుడు తక్కువగా ఇవ్వడం దారుణమన్నారు. మాజీ జెడ్పీటీసీ పైలా జగన్నాథరావు, టిడిపి నాయకులు అట్ట సన్యాసి అప్పారావు, వియ్యపు చిన్నా, రోంగలి గోపాల్ కృష్ణ, వర్రి వసంత రావు, పైలా ముత్యాల నాయుడు పాల్గొన్నారు.










