ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. లారస్ ల్యాబ్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వి.రవికుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.మనోరంజని ఒప్పంద పత్రాలు మార్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా తమ కళాశాలకు చెందిన విద్యార్థులు లారస్ ల్యాబ్స్ సంస్థ అందించే నైపుణ్యాలు ప్రయోగపూర్వకంగా నేర్చుకోవడం ద్వారా ఆ సంస్థలో ఇంటర్న్ షిప్, ఉపాధి అవకాశాలు కల్పించడానికి మార్గం సుగమం అవుతుందని కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు తెలిపారు. రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులందరికీ ఉన్నత విద్యా మండలి ఇంటర్న్ షిప్ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించిన నేపథ్యంలో తమ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు ఈ అవగాహనా ఒప్పందం ఉపకరిస్తుందని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి మనోరంజని మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా సిద్ధార్థ విద్యాసంస్థల డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రసాయన శాస్త్ర విద్యార్థులకు లారస్ ల్యాబ్స్ సంస్థలో ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లారస్ ల్యాబ్స్ మానవ వనరుల విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహారావు, హెచ్‌ఆర్ మేనేజర్ డి.సునీత, డిగ్రీ రసాయన శాస్త్ర ఇంఛార్జి డాక్టర్ పి.టి.యస్.ఆర్.కే.ప్రసాదరావు పాల్గొన్నారు.










