Dec 29,2022 23:55

ఆందోళన చేస్తున్న సిపిఐ నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-అనకాపల్లి
మొన్న లారస్‌ ఫార్మా, గతంలో బ్రాండిక్స్‌ వరుస ప్రమాదాల ఘటనల విషయంలో గోప్యత పాటిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక నెహ్రూ చౌక్‌ జంక్షన్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద గురువారం సిపిఐ ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ లారస్‌లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణిస్తే ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు. ఇందుకు బాధ్యులైన కంపెనీ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్య లోపాల కారణంగానే ప్రమాదం జరిగినట్టు స్పష్టమవుతుందన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, నాయకులు ఆర్‌.దొరబాబు, రామునాయుడు, సన్యాసిరావు, వైఎన్‌.భద్రం, చెల్లూరి నాగరాజు, కోన లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.