Dec 03,2022 22:15

బస్తాల్లో ధాన్యం నింపి అన్నదాత ఎదురుచూపులు
సంచుల కొరత తీవ్రం
35 శాతం కూడా పూర్తికాని ధాన్యం కొనుగోలు
నిడమర్రు మండలంలో పరిస్థితి దారుణం
40 కిలోల బస్తాకు రూ.24 జట్టుబిల్లు
తేమ శాతం పెరిగిందని సొమ్ము వసూలు
ధాన్యం విక్రయానికి రైతన్న అవస్థలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ధాన్యం కొనుగోలు రోజురోజుకు దారుణంగా మారుతోంది. సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. అవస్థలు పడి ధాన్యం బస్తాల్లో పట్టేసినా లారీలు రాకపోవడంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ధాన్యం బస్తాలను కాపాలా కాయలేక, వర్షం వస్తే దెబ్బతినే అవకాశం ఉండటంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. దీంతో లారీలు పంపండి మహాప్రభో అంటూ అన్నదాత తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. ధాన్యానికి లారీలు పంపకుండా వాటిని బియ్యం ఎగుమతులకు కేటాయించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న చర్చ నడుస్తోంది. ధాన్యం కొనుగోలుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఏ విధంగా సమంజసమంటూ రైతులు నిలదీస్తున్నారు. నిడమర్రు మండలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని రైతులు వాపోతున్నారు. అడవికొలను, భావాయిపాలెం, బువ్వనపల్లి వంటి పలు రైతుభరోసా కేంద్రాల పరిధిలో లారీలు రాక ధాన్యం మొత్తం బస్తాల్లో పట్టి ఉంచారు. రోజుకు రెండు, మూడు లారీలను మాత్రమే పంపుతున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. రెండు జిల్లాలవ్యాప్తంగా ఖరీఫ్‌లో 4.50 లక్షల ఎకరాల వరకూ రైతులు వరిసాగుచేశారు. ఖరీఫ్‌ మాసూలు దాదాపుగా ఆఖరుదశకు చేరుకుంది. ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన ధాన్యం 35 శాతం దాటలేదు. ఏలూరు జిల్లాలో 3.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 87 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 3.42 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా ఇప్పటి వరకూ లక్షా మూడువేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా సాగకపోవడంతో రోడ్లు, కల్లాల్లోనే ధాన్యం దర్శనమిస్తుంది. మరోపక్క రబీకి సమయం దగ్గర పడటం, ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. వర్షం పడితే రాసులుగా ఉన్న ధాన్యానికి ఇబ్బంది తక్కువగా ఉంటుందని, సంచుల్లో పట్టేసిన ధాన్యానికి ఇబ్బంది వస్తుందని రైతులు లబోదిబోమంటున్నారు. సంచులు సైతం అందక రైతులు సొసైటీల వద్ద క్యూ కడుతున్నారు. శనివారం సంచుల కోసం పోతునూరు గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టిన తర్వాత అందించిన పరిస్థితి ఉంది. రైతులు రోడ్డెక్కితే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు.
అన్నీ సమస్యలే
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం సమస్యగా మారింది. సంచులు సక్రమంగా అందకపోవడం పెద్ద సమస్యగా ఉంటే, ధాన్యం సంచుల్లో పట్టినా లారీలు లేక రైతులు నలిగిపోతున్నారు. గతంలో 40 కిలోల బస్తాకు జట్టు బిల్లు రూ.పది ఖర్చుకాగా ఇప్పుడు అదే బస్తాకు నేరుగా లారీలో వేస్తే రూ.18, తొలుత ట్రాక్టర్‌పై వేసి మళ్లీ లారీలో లోడ్‌ చేస్తే బస్తాకు రూ.24 అవుతుంది. ధాన్యం కాటా వేసిన చోట రూ.వంద వసూలు చేస్తున్నారు. జట్టు మామూలు కింద రూ.200 వరకూ తీసుకుంటున్నారు. డ్రైవర్‌ మామూలు రూ.600 ఇవ్వాల్సి వస్తుంది. నిడమర్రు మండలానికి చెందిన రైతులకు సంబంధించిన ధాన్యం గణపవరం వేబ్రిడ్జి వద్ద కాటా వేస్తున్నారు. అక్కడ అంతా సవ్యంగా వచ్చినప్పటికీ మిల్లు వద్దకు వెళ్లిన తర్వాత కాటా తగ్గిందంటూ కోతలు వేస్తున్నారు. ఇక్కడ తేమశాతం చూసిన తర్వాత అంతా సవ్యంగా ఉంటనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ మిల్లు వద్దకు వెళ్లిన తర్వాత తేమశాతం తగ్గిదంటూ అందుకు సంబంధించిన మినహాయింపు డబ్బులను రైతులతో ఫోన్‌ పే చేయించుకుంటునన్నారు. జట్లు బిల్లు, కిరాయి సొమ్ములు ఎప్పుడిస్తారో తెలియడం లేదు. ఒకవేళ ఇచ్చినా అవి ఇ-క్రాప్‌ జరిగిన భూయజమాని ఖాతాలో పడతాయని, ఆ సొమ్ములను కౌలురైతులకు ఇచ్చే అవకాశం ఉండదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నూతన ధాన్యం కొనుగోలు విధానంలో తీవ్ర సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు.
అధికారులపై తీవ్ర ఒత్తిడి
ప్రభుత్వం తెచ్చిన నూతన కొనుగోలు విధానంతో కిందిస్థాయి, ఉన్నతస్థాయి అధికారులు సైతం నలిగిపోతున్నారు. పౌరసరఫరాలశాఖ, వ్యవసాయశాఖ, మిగిలిన అన్ని శాఖల అధికారులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో రైతులను మెప్పించలేని పరిస్థితి నెలకొంది. రైతుల బాధలు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నామని కిందిస్థాయి అధికారులు పలుచోట్ల వాపోతున్నారు. లారీల సమస్యపై పౌరసరఫరాలశాఖ జిల్లా మేనజర్‌ మంజుభార్గవిని వివరణ కోరగా సమస్యను పరిష్కరించామని, లారీల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.