లారీ యజమానుల సమస్యలపై దృష్టి
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రజాశక్తి - బేతంచెర్ల
లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బేతంచెర్ల పట్టణంలోని వైసిపి కార్యాలయంలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సెవెన్ హిల్స్ నాగరాజు బృందం మంత్రి బుగ్గనను కలిశారు. ఈ సందర్భంగా లారీ యజమానుల బృందం మంత్రితో మాట్లాడుతూ బేతంచెర్ల పట్టణంలో బండ్లమెట్ట రుసుము వసూళ్లను లారీ యజమానులకు మినహాయించా లని కోరారు. మండలంలో లారీ యజమానులు వారి వారి లారీలను నిలుపుకొనుటకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ సాధ్యమైనంత త్వరలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వైసిపి ముస్లిం ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు ముర్తుజావలి అనారోగ్యంతో బాధపడుతూ కోలుకున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
గోరుమానుకొండ సమీపంలో అభివృద్ధి పనుల పరిశీలన
బేతంచెర్ల మండల పరిధిలోని గోరుమానుకొండ సమీపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి బుగ్గన పరిశీలించారు. సమీపంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాల ఐటిఐ ఎస్‌ఎంఎస్‌ఈ అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బేతంచర్ల మండలంలో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణం కోసం స్థలాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బేతంచెర్ల కొత్త బస్టాండ్ విస్తరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో బేతంచర్ల నగర పంచాయతీ చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు బాబుల్ రెడ్డి చంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బి అధికారులు, తహశీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, గోరుమానుకొండ సర్పంచి కోడే వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ప్రెసిడెంట్ ఖాజా హుస్సేన్, గూని నాగరాజు, రామనాయుడు, తిరుమలేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు










