Aug 10,2023 21:37

ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్‌/సీతానగరం : పార్వతీపురం నుండి ద్విచక్ర వాహనంపై బొబ్బిలి వెళ్తున్న నూతన దంపతులను గురువారం ఉదయం సీతానగరం మండలం గుచ్చిమి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢకొీనడంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా భార్య కొత్తకోట అమూల్య (24) మృతి చెందగా, భర్త దినేష్‌కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి దేవాంగుల వీధికి చెందిన ఈ జంటకు రెండు నెలల క్రితమే పెళ్లయింది. దినేష్‌ రెండు రోజుల క్రితమే హైదరాబాదు నుండి వచ్చి భార్యను తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తుండగానే ఈ సంఘటన జరగడం వారి కుటుంబాల్లో తీవ్ర దుఃఖం నింపింది. జిల్లా కేంద్రాసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.