భారతదేశంలో కరోనా సెకెండ్ వేవ్ వైరస్ కట్టడిలో బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి పాల్పడిందన్న 'లాన్సెట్' పత్రిక విశ్లేషణ ముమ్మాటికీ నిజం. జర్నల్ ఎత్తి చూపిన మోడీ ప్రభుత్వ ఘోరాతిఘోర తప్పిదాలు అంతర్జాతీయంగా మన దేశ పరువును అధ:పాతాళానికి దిగజార్చాయి. కరోనా మొదటి దశ సమయంలో బిజెపి, సంఫ్‌ు పరివారం, మోడీ భజనపరులు 'మోడీ కాబట్టి వైరస్‌ను అడ్డుకున్నారని' గోబెల్స్ ప్రచారం చేశారు. మొదటి దశ లోనే కోటికి పైగా కేసులు, లక్షకు పైగా మరణాలు సంభవించాయి. రెండవ దశకొచ్చేసరికి వైరస్ ఉధృతి చేతులు దాటిపోయే స్థితికి తీసుకొచ్చారు. ఈ వాస్తవంపైనే 'లాన్సెట్' దుయ్యబట్టింది. తొలి దశలో కరోనాను లాక్‌డౌన్‌లతో కొంత వరకు నియంత్రించిన సర్కారు, తదుపరి ఆ పాటి కూడా చేయకపోగా వ్యాధి వ్యాప్తికి ఇతోధికంగా తోడ్పడింది. అమెరికా, యు.కె సహా పలు దేశాల్లో సెకెండ్ వేవ్ భయంకరంగా విజృంభిస్తుండగా మొన్న మార్చిలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ దేశంలో కరోనా ఆట ముగిసిందని ప్రకటించి కరోనా కట్టడి చర్యలు అటకెక్కించారు. వ్యాక్సినేషన్ మందకొడిగా సాగింది.
వచ్చే ఆగస్టు లోపు దేశంలో పది లక్షల కరోనా మరణాలు సంభవిస్తాయంటూ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ అంచనాను 'లాన్సెట్' కోట్ చేసింది. ఈ విపత్తు సంభవిస్తే అందుకు ప్రధాని మోడీదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. ఏప్రిల్ 30 నాటికి 2.20 కోట్ల కేసులు, 2.22 లక్షల మరణాలు సంభవించాయి. అప్పటికి రోజుకు 2.78 లక్షల కేసులు నమోదయ్యాయి. మితిమీరిన ఎన్నికల ర్యాలీలు, లక్షలాది మంది గుమికూడటానికి అవకాశమిస్తూ కుంభమేళాల నిర్వహణ వైరస్ ఉధృతికి ప్రధాన హేతువు అన్న విషయం నిపుణులు చెబుతున్నదే. 'లాన్సెట్' సైతం అదే చెప్పింది. కరోనాపై జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం కేంద్ర నిర్లక్ష్యానికి తార్కాణం. సెకెండ్ వేవ్ తీవ్రత, కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్ వేరియంట్లపై సిసిఎంబి మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, ఇతర శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించామని చెబుతున్నారు. ఎందుకు అప్రమత్తం కాలేదో మోడీ ప్రభుత్వమే చెప్పాలి. గంగానదిలో స్నానం చేస్తే కరోనా రాదు, గో మూత్రం సేవిస్తే కరోనా నయమవుతుంది అనే ఆర్‌ఎస్‌ఎస్ మౌఢ్య ప్రచారం సరేసరి.
మహారాష్ట్ర తర్వాత బిజెపి ఏలుబడి లోని ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు, మరణాలు అత్యధికం. ఆ రాష్ట్రాలు కరోనా కట్టడికి సన్నద్ధం కాలేదని 'లాన్సెట్' వెల్లడించింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బలవంతంగా కరోనా పేషెంట్‌కు ఆక్సిజన్‌ను తొలగించిన వీడియో అక్కడి దుర్మార్గాలకు ఒక ఉదాహరణ. ఆస్పత్రిలో బెడ్ అడిగిన వారిపై ప్రజా భద్రతా చట్టం కింద కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో ఆక్సిజన్ కోసం ప్రాధేయపడుతున్న రోగులపై కేసుల బనాయించడం యోగి ఇలాకాలో అమానవీయ, ఆటవిక పాలనకు పరాకాష్ట. మోడీ ప్రభుత్వం సైతం సోషల్ మీడియాలో విమర్శకుల ఖాతాలను తొలగించేందుకు చూపిన శ్రద్ధలో కరోనా కట్టడికి ఇసుమంతైనా పెట్టక పోవడం దారుణం. కరోనా వ్యాక్సినేషన్‌కు బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లు ప్రతిపాదించిన కేంద్రం ఇప్పటికి ఖర్చు చేసింది రూ.4,700 కోట్లు మాత్రమే. వచ్చే మూడు మాసాలకు 16 కోట్ల వ్యాక్సిన్ డోసుల కోసం ఆర్డర్ పెట్టింది కూడా దీనిలో కలిసే ఉంది. ఈ వైఫల్యాన్ని కూడా 'లాన్సెట్' కడిగిపారేసింది. మెడికల్ జర్నల్ అయిన 'లాన్సెట్' రాజకీయాలు రాసిందని, తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు కుట్ర చేస్తోందన్న బిజెపి నాయకుల వాదన పొసిగేది కాదు. తొలిదశ కరోనా కట్టడిలో భారత్ విజయం సాధించిందని అదే 'లాన్సెట్' రాస్తే ఇదే బిజెపి నాయకులు జబ్బలు చరుచుకున్నారు. భారత్ ఇప్పటికైనా తన చర్యలపై పున:సమీక్షించుకోవాలని, వ్యాక్సినేషన్ వేగం పెంపు, కరోనా కట్టడికి సమర్ధవంతమైన చర్యలు, కేసులు, మరణాలపై పారదర్శకత పాటించాలన్న 'లాన్సెట్' సూచనలను మోడీ సర్కారు స్వీకరిస్తుందా? అదే లాన్సెట్ చెప్పినట్లు భారత్ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోందన్న విమర్శను నిజం చేస్తుందా ?










