ప్రజాశక్తి-పిఠాపురం గోకివాడ గ్రామంలో అక్కినీడి చెరువుకు నీరు వెళ్లే లాకులు తొలగిస్తే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని గ్రామంలోని రైతులు అధికారులను హెచ్చరించారు. శుక్రవారం క్రాప్ హాలిడే ఫ్లెక్సీతో మదుమ్ డ్యామ్ వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రామంలోని అక్కినీడి వారు చెరువు కింద సుమారు 500 ఎకరాల సాగు భూమికి నీరు పుట్టకొండ కాలువ ద్వారా వస్తుందన్నారు. చెరువు నిండిన తర్వాత రాపర్తి గ్రామ రైతులకు సాగు నీరు వెళుతుందన్నారు. రాపర్తి రైతుల రాజకీయ ఒత్తిళ్లతో చెరువు లాకులు తొలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని అదే జరిగితే తమ గ్రామంలో పంట పొలాలకు సాగు నీరు అందన్నారు. తమ గ్రామంలో చెరువు రెండు రోజుల్లో నిండిపోతుందని, తర్వాత నీరు రాపర్తి గ్రామానికి వెళుతుందని చెప్పారు. లాకులు తొలగిస్తే గోకివాడ పంటపొలాలకు చుక్క సాగు నీరు ఉండదని అంతా కిందకు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో సర్పంచ్ కీర్తి హరినాధ బాబు, ఎంపిటిసి వేమగిరి చిన్న నాగరాజు, రైతులు డి.వెంకటరావు, ఎన్.నానాజీ, ఎన్.సూరిబాబు, ఎ.దొరబాబు, చిట్టిబాబు, కె.వెంకటరావు, గుర్రాజు, కె రాంబాబు తదితరులు పాల్గున్నారు.










