కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో లాక్‌డౌన్ విధించి నేటికి ఏడాది పూర్తయింది. ఎటువంటి సన్నద్ధత లేకుండా కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన లాక్‌డౌన్ మూలంగా యావత్ ప్రజానీకం ముఖ్యంగా సామాన్యులు అసాధారణ కష్టాల పాలయ్యారు. కోవిడ్ నియంత్రణకు, వ్యాధిగ్రస్తులకు అవసరమైన వైద్య సదుపాయాలను అందించేందుకు కావలసిన మౌలిక వసతుల కల్పన, మందులు, ఇతర సేవలకవసరమైన నిధుల కేటాయించవలసిన కేంద్ర ప్రభుత్వం అవి మానేసి చప్పట్లు కొట్టమని, పళ్లాలు వాయించమని, దీపాలు వెలిగించమనీ ప్రజలకు ఉపదేశించడం బాధ్యతా రాహిత్యమే! గడచిన ఏడాది కాలాన్ని ఒక్కసారి అవలోకనం చేసుకుంటే ఎన్నో చేదు జ్ఞాపకాలు, బంధు మిత్రులను, ఆప్తులనూ కోల్పోయిన బాధ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. వేల కిలోమీటర్లు కాలినడకన వెళ్లి స్వగ్రామాలు చేరుకున్న వలస కార్మికుల ఇక్కట్లు వర్ణనాతీతం. అప్పటికే ఒడిదుడుకుల్లో వున్న ఆర్థిక వ్యవస్థ కోవిడ్‌తో మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన ప్రజలను ఆదుకోవలసిందిపోయి మోడీ సర్కారు కార్పొరేట్లకు రాయితీలిచ్చింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ వైరస్‌కు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టారు. ఈ ఏడాది అనుభవంతో కోవిడ్ బారినపడితే ఏ విధమైన వైద్యం, ఇతర సేవలనందించాలో వైద్యులకు, సిబ్బందికీ అవగాహన వచ్చింది. అంతకు మించి, కోవిడ్ అంటేనే భయంతో కంపించిపోయే పరిస్థితి ఇప్పుడు ప్రజలకు లేదు. అయితే, కోవిడ్ పట్ల వహించవలసిన జాగ్రత్తలనూ అలక్ష్యం చేస్తున్న వాతావరణం అనేక చోట్ల నెలకొనడం విచారకరం. గడచిన 24 గంటల్లో 47,262 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారంనాడు వెల్లడించింది. ఈ ఏడాదిలోనే అత్యధికంగా ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 275 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 11,734,058కు, మరణాల సంఖ్య 1,60,441కు చేరింది. 80 నుంచి 90 శాతం కేసులు మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత 24 గంటల్లో 35,066 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 585 మందికి వ్యాధి సోకినట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారంనాడు నిర్ధారించింది. నలుగురు మరణించారు. కోవిడ్ వైరస్ పరివర్తనం చెందుతూ కొత్తగా పలు వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున మళ్లీ లాక్‌డౌన్ విధించే పరిస్థితి ఏర్పడవచ్చని పలువురు భయపడుతున్నారు. తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత, పూణె, భోపాల్, జబల్‌పూర్, నాగపూర్ వంటి నగరాల్లో లాక్‌డౌన్...ఇంకొన్ని ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ వంటి చర్యలతో జనంలో ఆందోళన పెరుగుతోంది.
ప్రస్తుత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి బహుముఖ వ్యూహం అవసరం. ఎక్కువమందికి టీకా వేయడం ఒకటైతే వైరస్ సోకినవారికి సకాలంలో వైద్య సదుపాయాలు అందించడం మరొకటి. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తొలి రోజుల్లో మాదిరిగానే టెస్టింగ్, ట్రేసింగ్ ప్రక్రియలను కొనసాగించాలి. ఈ అన్ని అంశాల్లో ప్రణాళికాబద్ధంగా కృషి చేసిన కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ప్రపంచ ప్రశంసలనందుకుంది. వైరస్ సోకినవారి సంఖ్య పెరిగినా కేరళలో మరణాల శాతం అత్యల్పంగా ఉండడం గమనార్హం. మిగతా రాష్ట్రాలూ కేరళను ఆదర్శంగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగైదు వారాల్లో కోటి మందికి కరోనా టీకా వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదే. అయితే, అందుకు తగినంతమంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారో లేదో! కరోనా సోకిన వారికి వైద్య సేవలు అందించడానికి గతంలో ఉన్న సదుపాయాలన్నీ కొనసాగాలని బుధవారంనాటి సమీక్షలో సి.ఎం ఆదేశించారు. కాని గత ఏడాది నియమించిన కోవిడ్ సిబ్బందిని ఫిబ్రవరి చివర్లో విధుల నుండి తొలగించేశారు. ఇప్పుడు ఆ సదుపాయాలన్నీ ఎలా కొనసాగించగలరు? క్షేత్రస్థాయి పరిస్థితులు చక్కదిద్దడంపై పాలకులు శ్రద్ధ వహించడం అవసరం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీకా వేయించుకున్న వారితో సహా అందరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత అలవర్చుకోవడం అవశ్యం.










