May 19,2021 07:24

   లాక్‌డౌన్‌ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని, వైద్య సేవలు దొరకక ఇబ్బందిపడేవారు ఏ ఒక్కరూ ఉండకూడదని ప్రభుత్వం ముందే స్పష్టం చేసింది. అందుకోసం ఇళ్ళకు ఆహారపు కిట్లు అందించారు. సామూహిక వంటశాలలను తెరిచారు. 'జనకీయ' (ప్రజా) హోటళ్ళు ప్రారంభించారు. ప్రాథమిక, ద్వితీయ స్థాయి వైద్య సేవా కేంద్రాలు తెరిచారు. వీటిలో రోగులకు ఉన్న లక్షణాలను బట్టి వైద్యం అందించారు. సీరియస్‌ కేసులను గుర్తించి వారిని మాత్రం జిల్లా ఆస్పత్రులకు గాని, కోవిడ్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు గాని పంపారు. ఇళ్ళ వద్ద క్వారంటైన్‌లో ఉండే అవకాశం లేని వారికి ప్రత్యేక కేర్‌ సెంటర్లను తెరిచారు. అక్కడ వారికి వసతి, ఆహారం, వైద్యం అందించారు.

   దేశమంతా రెండో విడత కోవిడ్‌-19 విజృంభించింది. పరీక్షలు చేసిన కేసుల్లో 20 శాతం పైగా కరోనా సోకినట్టు నిర్ధారణ అవుతోంది. రోజుకు 4000 కన్నా ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా మరణాలు, గంగానదిలో కొట్టుకొస్తున్న శవాలు, అస్తవ్యస్తంగా నడుస్తున్న వ్యాక్సినేషన్‌-ఈ తరహా దృశ్యాన్ని మనం ఎవరమూ గతంలో ఎన్నడూ చూసిఎరుగం.
   కరోనా అదుపుకు మళ్ళీ లాక్‌డౌన్‌ విధించక తప్పదన్న అభిప్రాయం పలు వైపుల నుండి వ్యక్తం అవుతోంది. దేశం మొత్తం మీద లాక్‌డౌన్‌ అవసరం అని అంటున్నవారూ ఉన్నారు. నిపుణుల సలహాలు తీసుకుని, పూర్తి స్థాయిలో ముందస్తు సన్నాహాలు చేశాక, ఆ తర్వాతనే ఏ లాక్‌డౌన్‌ అయినా విధించాలి. అంతేగాని, గతంలో మాదిరిగా కేవలం నాలుగే నాలుగు గంటల వ్యవధిలో దేశం మొత్తం మీద లాక్‌డౌన్‌ విధించడం ఎంతమాత్రమూ సమర్ధనీయం కాదు.
   ఇప్పటికే చాలా రాష్ట్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్‌ లు, లేదా, కొన్ని ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు పరిమితంగా లాక్‌డౌన్‌ లు విధించారు. ఏ రూపంలో విధించినా, ఆ లాక్‌డౌన్‌ ఫలితంగా ఏయే తరగతుల ప్రజానీకం అతి ఎక్కువగా నష్టపోతారో, ఇబ్బందుల్లో పడతారో వారిని ఆదుకునే ఏర్పాట్లను చేసుకున్నాకనే లాక్‌డౌన్‌ విధించాలి. ఈ విషయంలో కేరళ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు.
   కేరళలో మే 8 నుండి 16 వరకూ పూర్తి లాక్‌డౌన్‌ విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని మే 6వ తేదీనే ప్రకటించారు. అందువలన లాక్‌డౌన్‌ కు సిద్ధపడడానికి ప్రజలకు రెండు రోజుల వ్యవధి లభించింది.
   లాక్‌డౌన్‌ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని, వైద్య సేవలు దొరకక ఇబ్బందిపడేవారు ఏ ఒక్కరూ ఉండకూడదని ప్రభుత్వం ముందే స్పష్టం చేసింది. అందుకోసం ఇళ్ళకు ఆహారపు కిట్లు అందించారు. సామూహిక వంటశాలలను తెరిచారు. 'జనకీయ' (ప్రజా) హోటళ్ళు ప్రారంభించారు. ప్రాథమిక, ద్వితీయ స్థాయి వైద్య సేవా కేంద్రాలు తెరిచారు. వీటిలో రోగులకు ఉన్న లక్షణాలను బట్టి వైద్యం అందించారు. సీరియస్‌ కేసులను గుర్తించి వారిని మాత్రం జిల్లా ఆస్పత్రులకు గాని, కోవిడ్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు గాని పంపారు. ఇళ్ళ వద్ద క్వారంటైన్‌లో ఉండే అవకాశం లేని వారికి ప్రత్యేక కేర్‌ సెంటర్లను తెరిచారు. అక్కడ వారికి వసతి, ఆహారం, వైద్యం అందించారు. ప్రైవేటు ఆస్పత్రులలో 50 శాతం పడకలు కోవిడ్‌ రోగులకు ప్రత్యేకించి కేటాయించాలని ఆదేశించారు. వలస కార్మికులు స్వంత ఊళ్ళకు తిరిగి పోకుండా అక్కడే ఉండడానికి వీలుగా వారికి అవసరమైన ఏర్పాట్లను చేశారు. వారికి వివరంగా అర్ధం కావడానికి వీలుగా హిందీలో సమాచారం అందించే ఏర్పాటు చేశారు. వారందరికీ ఆహారం, వ్యాక్సిన్‌లు అందిస్తామని స్పష్టం చేశారు.
   ప్రతీ జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్‌ రూమ్‌ లను ఏర్పాటు చేసి వాటిద్వారా అవసరమైన వారికి ఆస్పత్రులలో పడకలు కేటాయించారు. ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించారు. అంబులెన్సులు అవసరమైనవారికి అందుబాటులో ఉండేట్టు చూశారు.
   కరోనా పరీక్షలకు, వైద్యానికి ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసే చార్జీలపై పరిమితి విధించారు. దానిని కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు కోర్టుల్లో సవాలు చేస్తే హైకోర్టు సైతం వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైనదని తీర్పునిచ్చింది.
   కేరళలో ఇంతకు మునుపే స్థానిక సంస్థలకు అధికారాలను, నిధులను వికేంద్రీకరించారు. అది ఇప్పుడు కోవిడ్‌ పై పోరులో అక్కరకొచ్చింది. కోవిడ్‌ పై యుద్ధంలో ముందువరుస యోధులుగా పంచాయితీ మెంబర్లు, మునిసిపల్‌ కౌన్సిలర్లు నిలిచారు. వారివారి రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా అందరూ ఒక్కటిగా వ్యవహరించారు. తమ నియోజకవర్గ పరిధి లోని ప్రజలలో కొత్తగా కరోనా సోకినవారిని గుర్తించడం, వారికి అవసరమైన వైద్యం అందేలా చూడడం, వ్యాక్సిన్‌ వేయించుకోమని ప్రజలను ప్రోత్సహించడం, లాక్‌డౌన్‌ ఖచ్చితంగా అమలు జరిగేలా చూడడం, ఔషధాలు అందుబాటులో ఉండేట్టు గ్యారంటీ చేయడం, నిత్యావసర సరుకులు అందరికీ అందేలా చూడడం ఈ స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారానే జరిగింది. ప్రతిపక్ష పార్టీల కూటమి కూడా ఈ విషయంలో పాలక వామపక్ష కూటమికి చక్కగా సహకరించడం అభినందనీయం.
   మే 20న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. అప్పటికి కరోనా సంక్షోభం కొనసాగుతూనే వుంటుంది. కేసుల సంఖ్య పెరుగుతూ వుండడం, ఆక్సిజన్‌ కు కొరత ఏర్పడే ప్రమాదం పొంచివుండడం తదితర సవాళ్ళు కొత్త ప్రభుత్వం ముందుకు వస్తాయి.
అయితే ఇప్పటికే అక్కడ ఏర్పడిన వ్యవస్థలు కరోనాపై పోరును కొనసాగించడానికి, మూడవ దశ, తదనంతర దశలను కూడా ఎదుర్కొనడానికి తోడ్పడగలవు.
   ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రతీరోజూ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై పత్రికల ద్వారా ప్రజలకు సమాచారాన్ని ఇస్తున్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలను, చర్యలను, ప్రజలు సహకరించవలసిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. వాస్తవాలేమిటో తెలుసుకుంటున్నందున ప్రజలలో ఎటువంటి అనవసర ఆందోళనకుగాని, గందరగోళానికి గాని ఆస్కారం లేకుండా పోయింది. ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకుంటోందన్న విశ్వాసం వారికి కలిగింది. కేంద్ర ప్రభుత్వం, తక్కిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే విధంగా రోజూ బాధ్యతగా ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి. తమ తమ రాష్ట్రాలలో అన్ని పక్షాలనూ కరోనాపై పోరులో కలుపుకుని పోవాలి.
   కేరళ మాదిరిగానే తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో అనుసరించిన మెరుగైన పద్ధతులను, అనుభవాలను దేశం యావత్తూ వినియోగించుకోవాలి. 12 ప్రతిపక్ష పార్టీలు ప్రధానికి ఇటీవల రాసిన లేఖలో కొన్ని విలువైన సూచనలు ఉన్నాయి. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం స్వీకరించేలా ఒత్తిడి చేయాల్సివుంది. కరోనా బారి నుండి రక్షణ పొందే హక్కు ప్రజలందరికీ ఉంది. ఆ హక్కు నెరవేరేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది.

/ వ్యాసకర్త నెదర్లాండ్స్‌ కు మాజీ భారత రాయబారి /

వేణు రాజమణి