Jun 22,2023 01:16
సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి రమాదేవి

ప్రజాశక్తి-భట్టిప్రోలు: రేపల్లె ప్రాంతంలో వ్యవసాయ కూలిరేట్ల పెంపు కోసం పోరాటం చేసిన మహౌన్నత వ్యక్తి కామ్రేడ్‌ గొర్రుముచ్చు లాజర్‌ ఆశయాలను సాధించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి పిలుపునిచ్చారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పంచాయతీ పరిధిలోని అక్కివారిపాలెం గ్రామంలో లాజర్‌ సంస్మరణ సభ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన లాజర్‌ స్థూపాన్ని రమాదేవి ఆవిష్కరించగా స్థూపం వద్ద ఏర్పాటు చేసిన జెండాను బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య ఆవిష్కరించారు. అలాగే స్థూపం వద్ద గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ స్తూపం ఆవిష్కరణకు గ్రామస్థులు పెద్ద ఎత్తున ఎర్ర జెండాలతో ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్‌ అధ్యక్షత వహించారు. రమాదేవి మాట్లాడుతూ లాజర్‌ పార్టీ ఆశయాలకు కట్టుబడి పనిచేశారని కొనియాడారు. తన కుమారుడు సుధాకర్‌ను పార్టీకి అప్పగించి పార్టీలో శాశ్వత సభ్యునిగా ప్రజాసేవకు అంకితం చేశారని అన్నారు. కుటుంబ పోషణే కష్టంగా ఉండే పార్టీ సభ్యునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు ముందుకు రావటమే కాక ఆయన అల్లుడు, కుమారుడిని నిత్యం ప్రజా పోరాటాలకు ప్రోత్సహించే వాడని, అలాంటి వ్యక్తి లేకపోవటం పార్టీకి తీరని లోటని అన్నారు. అలాగే గంగయ్య, పాశం రామారావులు లాజర్‌ వ్యక్తిత్వంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి అగస్టీన్‌, నాగ మల్లేశ్వరరావు, నాగరాజు బిఎల్‌కె ప్రసాద్‌, వెంకట్రామయ్య, మురుగుడు సత్యనారాయణ, మరియు బాపట్ల, గుంటూరు జిల్లాల ప్రజాసంఘాల నాయకులు, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.