ప్రజాశక్తి-విజయనగరం : నేరాల నియంత్రణలో భాగంగా లాడ్జిల్లో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని వన్‌టౌన్ సిఐ బి.వెంకటరావు అన్నారు. ఎస్‌పి ఆదేశాలతో లాడ్జి యజమానులతో సోమవారం వన్ టౌన్ పోలీసు స్టేషనులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ లాడ్జిలో బస చేసే వ్యక్తుల సమాచారం, ఆధార్ కార్డు, చిరునామా, ఫోను నంబరు వంటి వివరాలను తప్పనిసరిగా రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. నేరాలను నియంత్రించడంలో భాగంగా లాడ్జీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యక్తుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వారు ఈ ప్రాంతానికి వచ్చి బస చేసే కారణం తెలుసుకోవాలని, అనుమానం ఉంటే సమాచారాన్ని పోలీసు స్టేషనుకు అందించాలని లాడ్జి యజమానులను కోరారు. నిబంధనలు అనుగుణంగా లాడ్జి యజమానులు వ్యవహరించకపోతే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్‌ఐ ఎస్.భాస్కరరావు, వి.అశోక్ కుమార్, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
రామభద్రపురం : అపరిచిత వ్యక్తులకు లాడ్జి గదులు అద్దెకు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు పరిశీలించాకే, కేటాయించాలని ఎస్‌ఐ సురేంద్ర నాయుడు తెలిపారు. సోమవారం మండల పరిధిలోని ఉన్న పలు లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఇతర రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడిన, నేరారోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. అటువంటి వ్యక్తులకు లాడ్జిల్లో చోటు కల్పించరాదని హెచ్చరించారు. అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం కల్పించవద్దని సూచించారు.










