ప్రపంచ మందుల పరిశ్రమ అత్యంత లాభదాయకంగా విరాజిల్లుతోందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న వ్యాధులపై విస్త్రుత పరిశోధన చేసి సరికొత్త నివారణా పద్ధతులు, మందులు కనిపెట్టడం అత్యంత కష్టసాధ్యమైన విషయమే కాక అత్యంత ఖర్చుతో కూడుకొన్నది. కాబట్టే ఆ మాత్రం లాభాలు అవసరమనే మందుల కంపెనీల వాదనలు కూడ సరయినవి కావని వివిధ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. కొత్త మందుల ఆవిష్కరణకు మందుల పరిశ్రమ తమ రాబడిలో అత్యంత స్వల్పంగానే ఖర్చు చేస్తాయని కూడా తెలుస్తోంది. పైగా పరిశోధన ద్వారా కొత్తగా అభివృద్ధి చేసిన మందుల్లో చాలా వరకు వ్యాధి చికిత్సలో గణనీయమైన, గొప్ప మార్పు ఏదీ తీసుకు రాలేకపోయాయని మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఎన్నో ఏళ్ళ మేధో శ్రమ, పరిశోధన ద్వారా అభివృద్ధి చేసిన ఉత్పత్తి మీద కొన్ని సంవత్సరాల పాటు తమకే సర్వహక్కులు ఉండేలా ఇతరులెవరూ ఆ మందుని ఉత్పత్తి చేయడానికి వీలు లేకుండా ఆయా దేశాల ప్రభుత్వాలు ఇచ్చే అనుమతుల (పేటెంట్ల) ద్వారానే మందుల కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు సంపాదిస్తుంటాయి. ఈ పేటెంట్ల కాలంలో మందుల కంపెనీలు తాము అభివృద్ధి చేసిన మందు మీద గుత్తాధిపత్యం కలిగి ఉండటం వలన అత్యధిక ధరలకు అమ్ముకుంటూ విపరీతమైన లాభాలార్జిస్తాయి. పేటెంటు కాలంలో ఆ మందు కనిపెట్టటానికైన ఖర్చును రాబట్టి భవిష్యత్తులో మరింత పరిశోధన చేసి ఇంకా మెరుగైన ఉత్పత్తిని అభివృద్ధి చేస్తామని కూడా అవి చెబుతుంటాయి. తాము అభివృద్ధి చేసిన మందులు పేటెంట్ కాలంలోనే అమ్మకాలు సాగించి లాభాలు సంపాదించగలమనీ దానిపైనే కంపెనీ అంతా ఆధారపడి ఉందనీ, పేటెంటు కాలం తీరిపోయిన తర్వాత తమ కంపెనీ కనుమరుగైపోవడం ఖాయమనీ చెప్పే మాటలు ఒట్టి బుకాయింపులేనని అమెరికా లోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వైద్యుడు స్టాన్లీ ఫిన్‌క్లిస్టెయిన్, అర్థ శాస్త్ర నిపుణుడు పీటర్ టెమిన్ తమ 'రీజనబుల్ ప్రిస్క్రిప్షన్' పుస్తకంలో తెలియజేశారు. రోగికి ఉపశమనం కలుగుతుందనే ఆశలను సొమ్ము చేసుకోవడమే కంపెనీల లక్ష్యంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాధి నుండి బయటపడవచ్చనే రోగి మానసిక బలహీనతలను బట్టి ధర నిర్ణయమవుతుందని కరోనా మహమ్మారి సందర్భంగా మరోసారి ప్రజలకు అనుభవవం అవుతోంది.
అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు, వినియోగదారుల హక్కుల కోసం కృషి చేసే న్యాయవాది కేట్ పోర్టర్ ఇటీవల 'కిల్లర్ ప్రాఫిట్స్' అనే నివేదికలో అమెరికా లోని మందుల పరిశ్రమ అత్యధిక లాభార్జన కోసం ఎటువంటి అనైతిక విధానాలకు పాల్పడుతుందో వెల్లడి చేశారు. కొద్ది నెలల దర్యాప్తు అనంతరం కొన్ని అమెరికన్ కంపెనీల అధినేతలను అమెరికన్ కాంగ్రెస్ విచారించిన సందర్భంగా ఆమె అడిగిన ప్రశ్నలూ, రాబట్టిన సమాధానాలు ఆసక్తికరంగా ఉండటమే కాక అత్యంత దిగ్భ్రాంతిగొలిపి సంచలనం సృష్టించాయి. ఆ విచారణను 15 మిలియన్లకు పైగా ప్రజలు ట్విట్టరు తదితర సామాజిక మాధ్యమాల్లో వీక్షించారు.
ఒక మందు నాణ్యతను, పని తీరును మెరుగుపర్చకుండా, ఆ మందును వాడిన ఫలితంగా ఉత్పన్నమయ్యే దుష్పరిణామాల్లో (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఎటువంటి తగ్గుదల సాధించకుండా, దాని తయారీ ఖర్చులోనూ ఎటువంటి మార్పులూ లేనప్పుడు, ఫార్ములాలో మార్పులు లేకుండానే అలాంటి మందుల ధరలను అమాంతంగా, అనూహ్యమైన రీతిలో ఏవిధంగా పెంచివేస్తారని ఆమె ప్రశ్నించారు. లింఫోమా, లుకేమియా వంటి క్యాన్సర్ చికిత్సలో వాడే ఇంబ్రోవికా అనే మందు ధర 2013లో 99 డాలర్లుండగా అదిప్పుడు 181 డాలర్లకు పెరిగింది. పాన్‌క్రియాటిక్ క్యాన్సర్, మల్టిపుల్ మైలోమా తదితర క్యాన్సర్ల చికిత్సకు వాడే రెవ్లిమెడ్ అనే మందు 2005లో ఒక టాబ్లెట్ ధర 215 డాలర్ల నుండి నేడు 763 డాలర్లకు పెరిగింది. ఈ ధరల పెంపు ఏ విధంగా సబబుగా ఉంటుందని, పెరిగే ధరలు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఏవిధంగా మేలు చేస్తాయని, వారు ఏవిధంగా తట్టుకొంటారని ఆమె ప్రశ్నించారు.
నేటి కరోనా వ్యాక్సిన్ తయారీకి ఫైజర్ కంపెనీకి 3.1 బిలియన్ డాలర్లు ఖర్చవగా ఒక్క 2021వ సంవత్సరం లోనే అది 26 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందనే అంచనాలున్నాయి. అదే మోడర్నా కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధన-అభివృద్ధికి రెండున్నర బిలియన్ డాలర్ల నిధులను అమెరికా ప్రభుత్వమే సమకూర్చగా 19.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతుందనే అంచనాలున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పరిశోధన మీద ఖర్చు చేసినదంతా సబ్సిడీల రూపంలో పొందటమే కాక 100 మిలియన్ డోసులను ముందస్తుగానే ఆర్డరు పొందిందని, అటువంటి ఆర్డరుతో పరిశోధనపై కంపెనీ పెట్టిన ఖర్చంతా వచ్చేస్తుందని అంచనా. వ్యాక్సిన్ తయారు చేసే 6 అతి పెద్ద కంపెనీలకు ఇటీవలి కాలంలోనే 12 బిలియన్ డాలర్ల సబ్సిడీ లభించినట్లు తెలుస్తోంది.
అంతేకాక ప్రభుత్వ రంగ సంస్థలు కేటాయించే నిధులతో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ద్వారా ఒక మంచి మందును తయారు చేసే సంస్థలను, కంపెనీలను ఒక్క ఉదుటుగా పెద్ద కంపెనీలు విలీనం చేసుకోవడం ద్వారా పరిశోధనా రంగంలో సృజనాత్మకత లోపించి కొత్త మందుల ఆవిష్కరణ నెమ్మదిస్తుందని కూడా తెలుస్తోంది. 2000-2008 సంవత్సరాల మధ్య సుమారు రెండు వేల నూతన ఆవిష్కరణల కోసం చేసే కృషి ఇటువంటి వ్యూహాత్మక, ఆర్థిక కారణాలతో నిలిపివేశారని 'కిల్లర్ ప్రాఫిట్స్' నివేదిక పేర్కొంది. '2018వ సంవత్సరంలో కొత్తగా ఆవిష్కరించిన మందుల్లో మూడింట ఒక్కటి మాత్రమే నిజమైన నూతన ఆవిష్కరణ. మిగతావి పాత వాటికి కొన్ని చిన్న మార్పులు చేసి కొత్తగా చూపెడుతున్నారు. తద్వారా ఎప్పటికీ పేటెంటు హక్కులు తమ దగ్గరే వుంచుకొని గుత్తాధిపత్యం చెలాయిస్తార'ని కూడా 'కిల్లర్ ప్రాఫిట్స్' నివేదిక తెలియచేసింది.
'మానవుల్ని వ్యాధుల నుండి దూరం చేసే, ప్రాణాంతక వ్యాధుల వలన సంభవించే మరణాలను తగ్గించగలిగే నూతన ఆవిష్కరణల కోసం చేసే పరిశోధనపై మందుల కంపెనీలు తమ రాబడిలో గణనీయంగా ఖర్చు చేయాలి. శ్రద్ధ పెట్టాలి. ఆ విధంగా జరగాలంటే ఇప్పుడున్న చట్టాల్లో తగు మార్పులు చేయాల'ని కేట్ పోర్టర్ తన నివేదికలో పేర్కొనడాన్ని సభ్య సమాజం స్వాగతిస్తోంది.
/ వ్యాసకర్త ఎ.పి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ సంయుక్త ప్రధాన కార్యదర్శి /
పి.దక్షిణామూర్తి











