ప్రజాశక్తి- కె.కోటపాడు
కె.కోటపాడు మండలం, చౌడువాడలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) లాభాల వైపు అడుగులు వేస్తోంది. ఈ మండలంలోని ఎ.కోడూరు, పాతవలస సొసైటీలు నష్టాలు ఊబిలో కూరుకుపోయి మూతపడగా, చౌడువాడ సొసైటీ అనేక ఒడుదుడుకులు ఎదుర్కొని నిలబడి నేటికీ రైతులకు సేవలు అందిస్తోంది. చైర్మన్, పాలకవర్గం, సిబ్బంది కృషి, శ్రమతో అభివృద్ధి పథంలో పయనిస్తోంది.
చౌడువాడ పిఎసిఎస్‌ను 1977లో ప్రారంభించారు. నాడు 20 మంది రైతులు సభ్యులు ఉండగా, నేడు 3,700 మంది ఉన్నారు. ఈ సొసైటీలో చౌడువాడ, మల్లమ్మపాలెం, గరుగుబిల్లి, గొండుపాలెం, రొంగల నాయుడుపాలెం, గుల్లేపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు సభ్యులుగా ఉన్నారు. మొదటిలో ప్రైవేటు భవనంలోనూ తరువాత సొంత భవనంలో విధులు నిర్వహించగా, ఆ భవనం కూడా శిథిలావస్థకు చేరంది. దీంతో గ్రామంలోని పాలకేంద్రం సమీపంలో మల్లంపాలెం రోడ్డు దగ్గర రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించారు.
ఈ సొసైటీలో ప్రస్తుతం రూ.2.56 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. 68 మందికి రైతులకు దీర్ఘకాలిక రుణాలు 2.80 కోట్లు, స్వల్పకాలిక రుణాలకు 1000 మందికి రూ.5 కోట్లు ఇవ్వడం జరిగింది. వ్యాపారస్తులు గ్రూపులుగా ఏర్పడగా, 21 గ్రూపులకు రూ.36.50 లక్షలు రుణాలు అందజేశారు. తక్కువ వడ్డీతో బంగారం ఆభరణాలపై 150 మందికి కోటి 78 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది.
సొంత భూమి కలిగి ఉన్న రైతులకు 1బితో స్వల్పకాలిక రుణాలు, బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కల్పించబడుతోంది. కోళ్ల ఫారాలు, పాల డెయిరీలు ఏర్పాటు చేసుకునే వారికి అర్హతను బట్టి రుణాలు ఇస్తున్నారు. భూమి అభివృద్ధికి ఏడు సంవత్సరాల వ్యవధిలో 80 పైసల వడ్డీతో రుణ సదుపాయం కల్పిస్తున్నారు. రైతులు తమ భూముల్లో బోర్లు, మోటార్లు వేసుకునేందుకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నారు. ఈ సొసైటీలో రైతులకు రుణ సదుపాయంతో పాటు వారికి కావలసిన ఎరువులు, క్రిమిసంహార మందులు, టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి ఏటా ఈ సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల వద్ద ప్రభుత్వం ప్రకటించిన ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీరుస్తూ అందరికీ అందుబాటులో ఈ సొసైటీ ఉంటుంది. రైతులు తీసుకున్న రుణాలు వారు సకాలంలో చెల్లించే విధంగా సొసైటీ చైర్మన్ రాజి మోది నాయుడు, ముఖ్య కార్యదర్శి బత్తిన సత్యనారాయణమూర్తి, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. దీంతో ఇంతవరకు నష్టాల్లో ఉన్న ఈ సొసైటీ ఇప్పుడిప్పుడే లాభాల వైపు పయనం చేస్తోంది.
అన్ని వర్గాల వారికి రుణాలు
సొంత ఇల్లు కలిగిన వారికి ఇంటి తనకాపై రుణ సదుపాయం కల్పిస్తున్నాం. మా సొసైటీలో వ్యక్తిగత రుణాలు కూడా ఇస్తాం. చిన్న వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి వారికి వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీకి అందజేస్తాం.
- రాజి మోదినాయుడు, సొసైటీ చైర్మన్










