లాభాల పట్టు..
మల్బరీ సాగుపై రైతుల ఆసక్తి
38 వేల ఎకరాల్లో 1,3623 మెట్రిక్ టన్నుల పట్టు గూళ్లు ఉత్పత్తి
సిరికల్చర్ హబ్‌తో మహర్థశ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: వ్యవసాయ రంగం ఆధునికతను సంతరించుకొని కొత్త పుంతలు తొక్కి రైతుకు మరింత ఆదాయం చేకూరేలా మారుతోంది. రాష్ట్రప్రభుత్వం అందుకు సహకారం అందించడం జరుగుతోంది. ఫలితంగా రైతు సమయానుకూలంగా పంటలు పెట్టి లాభాల వైపు నడుస్తున్నారు. గతంలో పట్టు ఉత్పిత్తి చాలా వరకు ఇబ్బందులు కలిగించేది. వివిధ రకాల వ్యాధులు వాటిని సకాలంలో అరికట్టలేక, నీటివసతి వరుస కరువు వల్ల ఇబ్బందుల పాలవుతూ వచ్చారు. ప్రస్తుతం అలా కాకుండా రైతులకు పట్టుపురుగులు పెంపకం ద్వారా సిరులు కురుస్తున్నాయి. ఏడాదికేడాది విస్తీర్ణం పెంచుతూ లాభాలు పెంపొందించుకొని రైతన్నలు ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా ఈ పంటపై కీటకాలు కానీ చివరకు ఏనుగులు కూడా ఎక్కువ ఆశించకపోవడం వల్ల పడమటి మండలాల్లోని అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామ రైతులు ఎక్కువ మక్కువ చూపుతూ భారీఎత్తున పంటను సాగు చేస్తున్నారు. మల్బరీ సాగు మరింత పెంచాలని రైతులు, అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 21, 600 మంది రైతులు సుమారు 38 వేల ఎకరాలలో జిల్లాలోని 29 మండలాలలో ఈ పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో గత 6 నెలలలో 1,3623 మెట్రిక్ టన్నుల పట్టు గూళ్ళు ఉత్పత్తిచేసి సుమారు 690కోట్లు ఆదాయం పొందారంటే జిల్లాలో పట్టు పై పట్టు రైతన్నలు ఏవిధంగా సాధించారో తెలుస్తుంది. ప్రధానంగా బై ఓల్టిన్ రకం 2,764 మెట్రిక్ టన్నులు పండించారు. పట్టుదారం తీసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయడం ద్వారా 1500మంది రీలర్లు ఉపాధి పొందుతున్నారు. అంతేగాక ఈ పంట పెంపకం రోజులలో ఒక ఎకరా సాగు చేసేవారు మరో ముగ్గురు లేదా నలుగురికి ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. జిల్లాలోని పలమనేరులో సమీపంలోని చాకి పురుగుల పెంపక కేంద్రం, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో చాకీ కి సంబంధించిన గుడ్లు లభిస్తుందడం, గుడ్లు పెంపక కేంద్రాలలో ఉన్న వాతావరణ పరిస్థితులు పడమటి ప్రాంతాలలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఒకే విధంగా ఉండటం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక్కసారి మల్బరీ పంట వేస్తే 20 సంవత్సరాలు అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే పంటను కొనసాగించవచ్చు. ప్రభుత్వ సహకారంతో నిర్మించుకున్న షెడ్లు సుమారు 30సంవత్సరాల కాలపరిమితి ఉంటాయి. కాబట్టి రైతులు ఈ పంటపై మక్కువ చూపుతున్నారు.
పట్టు పరిశ్రమకు ప్రధానంగా మల్బరీ ఆకు ముఖ్యమైనది. దీనికి సంబంధించి విత్తన కొనుగోలు పెద్ద ఇబ్బంది ఉండదు. ఎవరైతే మల్బరీ సాగు చేస్తున్నారో వారి వద్ద నుంచి కొమ్మలు తెచ్చుకొని ఒక్కో కొమ్మకు రెండు అడుగుల దూరం ఉంచి నాటడం జరుగుతుంది. ఆ విధంగా నాటిన మల్బరి మొక్కలు చెట్లుగా రూపాంతరం చెందడానికి మొదటనెల రోజులు సరిపోతుంది. మొక్కలలో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో వి1, బరంపురం ప్రధానమైనవి. ఈ రెండు రకాలు రెండవ పంట రావడానికి నెల నుంచి నెలన్నర వ్యవధి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో ఏడాదిలో ఆరు నుంచి తొమ్మిది పంటలను తీసుకునే అవకాశం మల్బరీలో ఉంది. మొదటగుడ్లు తీసుకురావడం వాటిని పొదిగించడం గ్రామాలలోనే చేసేవారు. విభిన్న వాతావరణ పరిస్థితులను దష్టిలో పెట్టుకొని చాకిపురుగుల కేంద్రం వారు వారి వద్దనే పురుగులుగా తయారు అయ్యేంత వరకు ఉంచుకొని రైతులకు ఇస్తున్నారు. ఈవిధంగా ఒక గాజు రింగు సైజులో ఉండే మల్బరీ గుడ్లను ఒకటిగా భావిస్తారు. అలా 100 గుడ్లు తీసుకువస్తే ప్రస్తుతం 80 కేజీల వరకు పట్టు గుళ్ళు రావడం జరుగుతుంది. ఇందుకోసం ఏర్పాటు చేసుకున్న షెడ్లలో ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా మల్బరీ పురుగుల పెంపకం సాగుతుంది. ఇందులో ప్రధానంగా నాలుగు దశలు నెలరోజుల్లోపే ఉంటాయి. అత్యంత శుభ్రతను ఈ షెడ్లలో పాటించడం జరుగుతుంది. చివరి దశలోకి తిరిగి గూళ్ళు అల్లుకొని మనకు లాభాలు పెంచుతాయి. ఈ మొత్తం ప్రక్రియ 30 రోజుల్లోపు పూర్తి అవుతుంది. మొదట కత్తిరించిన మల్బరీ మొక్కలు తిరిగి వివరించడం 15 రోజులకెల్లా అవి కోతకు రావడం జరుగుతూ ఉంటుంది. అలా రెండు ఎకరాలలో మల్బరీసాగు చేసేవారు సంవత్సరానికి 6 పంటలు తీయడం జరుగుతుంది. 100 గుడ్లతో 80 కేజీల వరకు పట్టుగూళ్ళు ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం ధరలు భారీగా ఉండటంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తోంది. పట్టుపురుగులకు వేసే మల్బరీ ఆకు విషయంలో వి1 రకం ఎక్కువగా దిగుబడి అవుతుండడంతో ఇతర రకాల కన్నా ఈ రకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పట్టుగూళ్ళను తయారు చేసుకుంటూ ఈ పంటపై ఎక్కువ మక్కువ చూపడం జరుగుతుంది.
పలమనేరు, కుప్పం నియోజకవర్గాలలో పలు ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలే పట్టు పరిశ్రమపై మక్కువ చూపుతున్నారు. అందుకు ప్రధానకారణం ఈ ప్రాంతాలు ఎక్కువగా అటవీ ప్రాంతాల వైపు ఉండడం, ఏనుగులు ఈ పంటను ఎక్కువ ఆశించకపోవడం ప్రధానంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రోత్సాహకం కూడా బాగా ఉండటంతో మరింత విస్తీర్ణంలో పంట సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని 31 మండలాలలో 27 మండలాల్లో పట్టు సాగు చేస్తున్నారు.
ఆన్‌లైన్ అమ్మకాలు....
గతంలో పట్టుగూళ్ల మార్కెట్‌కు వెళ్లి మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి ఉండేది. కొన్ని ప్రాంతాలలో అలా కాకుండా పట్టుదారం తీసే వ్యాపారస్తులు నేరుగా గ్రామాలలోకి వెళ్లి ముందే ధరలు కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. అయితే ఏరోజుకారోజు ఉన్న ధరలను ఆన్లైన్ ద్వారా తెలుసుకొని అమ్ముకుంటున్నారు. దీనివల్ల రైతులకు సిరికల్చర్ పంట ద్వారా సిరులు కురుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం లభిస్తుందడం ప్రస్తుతం ధరలు మరింత ప్రోత్సాహకంగా ఉండటంతో రైతులు ఈ పంటపై ఎక్కువ మక్కువ చుపుతున్నారు.
డ్రిప్‌తో సాగు ఖర్చు తక్కువ ..
సాగుకు అయ్యే ఖర్చు తక్కువ. ఒకసారి డ్రిప్ వేస్తే పది సంవత్సరాల పాటు ఉంటుంది. కనుక నీటి తడులు కూడా దీనికి చాలా వరకు తక్కువగానే ఇవ్వాల్సి ఉంటుంది. వాతావరణంతోపాటు ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తుండడంతో రైతన్నలు ఈపంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. సిరికల్చర్ ద్వారా సిరులు కురుస్తున్నాయి.