Aug 25,2023 22:32

మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ప్రజాశక్తి-నెల్లూరు :కేంద్ర సహకార బ్యాంకుల అభివద్ధికి సీఈఓలు చిత్తశుద్ధితో పనిచేసి లాభాలబాటలో నడపాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకులో ఉమ్మడి 13 జిల్లాల డిసిసి బ్యాంకుల సిఇఒల రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసి రైతులు, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన సహకార బ్యాంకుల సీఈవోలకు పూర్తి పరిజ్ఞానం ఉంటుందని, వీరంతా భవిష్యత్తులో మరిన్ని గొప్ప నిర్ణయాలు తీసుకొని సహకార బ్యాంకుల బ్యాంకుల అభివద్ధికి కషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్క జిల్లాలో ఈ కాన్ఫరెన్స్‌ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల అందరూ కలిసి బ్యాంకుల అభివద్ధికి నిర్ణయాలు తీసుకుని అవకాశం కలుగుతుందని, ఇది మంచి పరిణామ మన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సహకార రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన ఆలోచన విధానం, చేపడుతున్న కార్యక్రమాల వల్ల నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకులు లాభాల బాట పట్టాయని చెప్పారు. సహకార చట్టాలను సవరణ చేసి ఆప్కాబ్‌, డిసిసిబి జనరల్‌ బాడీలో బ్యాంకింగ్‌, ఆడిటింగ్‌ రంగాల్లో నిష్ణాతులైన వారిని సభ్యులుగా చేర్చి, వారి సూచనలు, సలహాల మేరకు సులభ తరంగా రైతులకు రుణాలు మంజూరు చేయడం, బ్యాంకింగ్‌ కార్యకలాపాలు మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిం దన్నారు. సహకార రంగానికి ఒక బ్రాండ్‌ ఉండాలని సరికొత్త లోగోను కూడా రూపొందించామని, ఇటీవలే ఈ లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించి సంతప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి చెప్పారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న బ్యాంకులకు తమ ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయాలతోనే ఎన్నో ఏళ్లుగా నష్టాలు చవిచూసిన కర్నూలు, కడప సహకార బ్యాంకులు లాభాల బాట పట్టాయని, ఏలూరు బ్యాంకు ను కూడా గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేపట్టినట్టు మంత్రి స్పష్టం చేశారు.
కార్పొరేట్‌ బ్యాంకులకు ధీటుగా డిజిటలైజేషన్‌
సరికొత్త ఆలోచనలు, నూతన టెక్నాలజీతో సహకార బ్యాంకుల్లో అనేక సంస్కరణలు చేపడుతున్నట్లు ఆప్కాబ్‌ చైర్‌ పర్సన్‌ ఝాన్సీరాణి వెల్లడించారు. ఈ-ఆఫీసు, ఈ స్టాంపింగ్‌, ఆన్లైన్‌ సర్వీసులు ఇలా అన్ని డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ పై బ్యాంకు కార్యకలాపాలు చేపడుతున్నట్లు చెప్పారు. దేశంలోని సహకార బ్యాంకును అగ్రస్థానంలో నిలిపేలా అందరి సహకారంతో కషి చేస్తున్నామన్నారు. పెట్రోల్‌ బంకులు, గోడౌన్ల ఏర్పాటులో ముందున్నామన్నారు. పల్లె పల్లెకి సహకార బ్యాంకుల సర్వీసులను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. రైతులకు 24 గంటల్లో పంట రుణాలు మంజూరు చేసేలా బ్యాంకు డిజిటలైజేషన్‌ పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎన్‌ డి సి సి బ్యాంక్‌ చైర్మన్‌ శ్రీ కామిరెడ్డి సత్యనారాయణ కోరారు. పారదర్శకంగా, ఎక్కడా రాజీ పడకుండా ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఎంపిక చేసుకుని రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం రెండు మొబైల్‌ ఎటిఎంలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. పొదుపు మహిళలకు సంబంధించి రూ 2.50 కోట్ల మెగా చెక్కును అందజేశారు. ఈ కాన్ఫరెన్స్‌ లో ఆప్కాబ్‌ ఎండి శ్రీనాథ్‌ రెడ్డి, ఆప్కాబ్‌ సీజీఎం రాజయ్య, నాబార్డ్‌ జనరల్‌ మేనేజర్‌ జయ కన్నన్‌, నెల్లూరు డిసిసిబి చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సీఈఓ శంకర్‌ బాబు, డి సి ఓ సుధా భారతి, 13 జిల్లాల సహకార బ్యాంకుల సీఈఓలు పాల్గొన్నారు.