చాపాడు : మండల పరిధిలో సాగుచేసిన బీర పంట రైతులకు లాభాలను చేకూరుస్తున్నాయి. మండల పరిధిలోని సీతారామపురం, రాజుపాలెం, తిప్పి రెడ్డి పల్లె గ్రామ పరిధిలో బీర పంటను రైతులు సాగు చేపట్టారు. ఎకరాకు కోతకు రెండు టన్నుల వరకు దిగుబడి వస్తుందని, మూడు నాలుగు రోజులకు ఒకసారి దిగుబడి వస్తుందని రైతులు చెప్పారు. కిలో రూ.30 లెక్కన ప్రొద్దుటూరు, హైదరాబాదు, నెల్లూరు, తిరుపతి వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. వ్యాపారులే పంటపొలాల వద్దకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. రైతు స్వయంగా పంటను తరలిస్తే మరో రెండు రూపాయలు అదనంగా చెల్లిస్తున్నట్లు చెల్లిస్తారు. ఎకర సాగుకు రూ. 50 వేల వరకు ఖర్చులు అవుతున్నాయని పేర్కొంటున్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు అధికంగా ఉండడంతో మరింత ఖర్చు పెరగనుంది. పది రోజులుగా ఎండ తీవ్రతకు చెట్లు దెబ్బతింటున్నాయని, దిగుబడి సరిగా లేదని రైతులు పేర్కొంటున్నారు. కర్రల పైన బీర సాగు చేపట్టడం వల్ల కాయలు పొడవుగా ఏర్పడి మంచి దిగుబడి వస్తుందని పేర్కొంటున్నారు. సీతారామాపురం గ్రామ పరిధిలో 10, మండల పరిధిలో వివిధ గ్రామాల్లో 10 ఎకరాల్లో సాగు చేపట్టారు. అట్టపెట్టెలలో బీరకాయలను పేడ్చి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. వరి పంట సాగు అనంతరం కూరగాయలు సాగు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. బీరకాయలను ప్యాక్ చేస్తున్న కూలీలు










