ప్రజాశక్తి-సబ్బవరం
మండలంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డిఎస్‌ఎన్‌ఎల్‌యు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసిఎ) మధ్య బుధవారం అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరింది. లా వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాష్, ప్రవీణ్ కుమార్ (డైరెక్టర్ జనరల్), ఐఐసిఎ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పైలా నారాయణరావు ఎంఇయు పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా విసి సూర్యప్రకాష్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా భారతదేశంలోని కార్పొరేట్ రంగం వృద్ధికి, సమీకృత, బహుళ-క్రమశిక్షణా విధానం ద్వారా మద్దతు ఇవ్వడానికి దేశ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐఐసిఎను స్థాపించినట్లు చెప్పారు. డిఎస్‌ఎన్‌ఎల్‌యు పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మార్చుకొనే ప్రయత్నాల్లో భాగంగా అకడమిక్, రెగ్యులేటరీ, పరిశోధన సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పర్చుకుంటుందని, ఇందులో భాగంగా ఈ ఎంఒయు కుదుర్చుకుందని తెలిపారు. డిగ్రీ, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులను, ఎల్‌ఎల్‌ఎం వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించడానికి, అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ప్రచురణ, నిపుణుల సలహా, ఉమ్మడి వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, సమావేశాలు నిర్వహించడం, ఇతర విద్యాపరమైన సహకారం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లా వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.మధుసూధనరావు, ప్రొఫెసర్ ఎ.రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ దయానంద మూర్తి, పి.బయోల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.










