మలయాళ నటుడు దుల్కర్‌సల్మాన్‌కి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. 'ఒకే బంగారం, 'మహానటి', 'కనులు కనులను దోచాయంటే' వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటివరకు చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించిన దుల్కర్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ 'కురుప్' సినిమాలో నటించారు. ఈ సినిమా మలయాళం, తమిళం, కన్నడ, హిందీ, తెలుగు ఐదు భాషల్లో నవంబర్ 12న విడుదలైంది. మరి ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో లేదో తెలుసుకుందామా..!
కథ
కేరళలో ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోపీ కృష్ణన్ (దుల్కర్‌సల్మాన్) జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాల నుంచి.. పెద్ద పెద్ద నేరాలు చేసే స్థాయికి వెళతాడు. ఈ క్రమంలో శారదాంబ (శోబితా ధూళిపాళ్ల)తో ప్రేమలో పడతాడు. జీవితంలో చిన్న చిన్న నేరాలు కాకుండా. ఒక పెద్ద నేరం చేసి లైఫ్‌లో సెటిల్ కావాలని ప్లాన్ చేసుకుంటాడు. దానికి తాను చనిపోయినట్లుగా అందరినీ నమ్మిస్తాడు. ఆ తర్వాత గోపికృష్ణన్ కాస్తా.. సుధాకర్ కురుప్, అలెగ్జాండర్‌గా అవతారమెత్తి.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌గా మారతాడు. అతని కోసం పోలీసుల అన్వేషిస్తారు. ఈ అన్వేషణలో.. తన జీవితం గురించి పోలీసులు ఏం తెలుసుకుంటారు? పోలీసుల నుంచి కురుప్ ఎలా తప్పించుకుంటాడు? అనేదే మిగతా కథ.

విశ్లేషణ
1070ల్లో దేశవ్యాప్తంగా మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌గా పేరుగాంచిన కురుప్.. అతని జీవితం ఆధారంగా తీసిన చిత్రమిది. సాధారణంగా క్రిమినల్ జీవితం తెరకెక్కించడమేంటి? ఓ నేరస్థుడిని హీరోగా వెండితెరపై చూపించడమేంటి? అని దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్‌పై విమర్శలు వచ్చాయి. అయినా ఆయన అవేవీ పట్టించుకోకుండా..ఓ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి.. నేరాలకు ఎలా పాల్పడతాడు? అన్నదాన్ని వెండితెరపై చూపించాడు. అందులోనూ ప్రేమని జోడించి.. క్రైమ్ అండ్ థిల్లర్‌గా కథనాన్ని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎక్కడా దుల్కర్‌ని హీరోగా హైలైట్ చేయకుండానే.. తెరపై ప్రధానపాత్రగా మలిచిన తీరు బాగుంది. ఇక ప్రథమార్థంలో కథలో లీనం చేయడానికి కొంత సమయం తీసుకున్నా.. విరామానికి ముందు.. చివరి అరగంట సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. ఒకరకంగా చెప్పుకోవాలంటే.. కథనం ఆసక్తికరంగా కొనసాగుతుంది. దాదాపు ఇందులో క్రైమ్, ప్రేమ, యాక్షన్ ఇలా అన్ని రకాల జోనర్లు కలిసిన సినిమాగా చెప్పుకోవచ్చు.

ఎవరెలా చేశారంటే..
ఈ చిత్రంలో 'కురుప్'గా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించారు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరుని చూసి మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమాలో దుల్కర్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఈ సినిమాతో దుల్కర్ నటనా స్థాయి పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్‌గా శోభిత ధూళిపాళ్ల హోమ్లీ లుక్‌లో అందంగా కనిపించారు. దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ పాత్రల ఎంపిక, తెరకెక్కించిన విధానమూ బాగుంది. ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా ఇంద్రజిత్ సుకుమారన్ నటన ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో క్రైమ్ సీన్స్‌ను చూపించిన నిమిష్ రవి కెమెరా పనితనం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఇక ఇందులోని సాంగ్స్ కన్నా.. సందర్భానుసారంగా వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.










