Oct 05,2023 07:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పున:పంపిణీ చేయాలని కేంద్ర కేబినెట్‌ అభిప్రాయపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా కృష్ణా జల వివాద ట్రిబ్యునల్‌-2కు సంబంధించిన నిబంధనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నెలకొన్న వివాదాన్ని వీటి ప్రకారం పరిష్కరించాలని కెడబ్య్లుడిటికి సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు హాని చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్‌ పంపిణీ చేస్తుంది. ఐఎస్‌ఆర్‌డబ్ల్యుడి చట్టం, 1956లోని సెక్షన్‌ 3 ప్రకారం రాష్ట్రాలు చేసిన అభ్యర్థనలపై 2004లో కేంద్ర ప్రభుత్వం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌-2 బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తుది తీర్పు గెజిట్‌లోకి వచ్చే సమయంలో 2014 రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణా తమకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులు న్యాయసమ్మతంగా లేవని పేర్కొంది.కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణపై వివాదాన్ని పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు 2015లో సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. 2020లో జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రెండవ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ విషయం చర్చించారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ సిఫార్సులు గజెట్‌లో ప్రచురితం కాకున్నా ప్రాజెక్టుల కేటాయింపుల ఆధారంగా ఎపికి 512 టిఎంసిలు, తెలంగాణా 299 టిఎంసీలు వినియోగించుకునేలా తాత్కాలిక ఏర్పాటు చేసుకున్నారు. ట్రిబ్యునల్‌ కాలపరిమితి ఉన్నంత కాలం ఈ ఒప్పందం అమలులో ఉండాల్సిఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల మధ్య మధ్యంతరంగా మరోసారి కృష్ణా జలాల పంపిణీ చేయాలని కేంద్ర కేబినెట్‌ తాజాగా నిర్ణయించింది. ఇది రాష్ట్ర రైతాంగానికి నష్టం చేకూరుతుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణాలో ఎన్నికలు వున్నందున రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  • పసుపు బోర్డు, గిరిజన యూనివర్శిటికి ఆమోదం

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు, సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర క్యాబినేట్‌ ఆమోదం తెలిపింది. తెలంగాణలో గిరిజనుల ఉన్నత విద్య కోసం ఈ వర్సిటీని రూ.889.07 కోట్ల వ్యయంతో ములుగులో ఏర్పాటు చేయనున్నారు. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఉజ్వల పథకం లబ్దిదారులకు 14 కేజీల గ్యాస్‌ సిలిండర్‌పై ఇచ్చే రాయితీని రూ.300కు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఉజ్వల పథకం కింద పేదలకు సరఫరా చేసే వంట గ్యాస్‌ సిలిండర్‌పై ప్రస్తుతం కేంద్రం రూ.200 చొప్పున రాయితీ ఇస్తుండగా.. తాజాగా దాన్ని రూ.300కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ మార్కెట్‌ ధర రూ.925 ఉండగా.. ఉజ్వల లబ్దిదారులు రూ.725 చొప్పున చెల్లిస్తున్నారు.