Nov 06,2022 10:03

కొత్త చరిత్రను సృష్టించాలి
మరో చరిత్రకు నాంది పలకాలి
సంభవించిన పరిణామాలు సమాప్తం కాదు
చరిత్రకు అర్థం చైతన్య దీప్తి జరగాలి..

వర్తమానంలో నాణ్యత ఉండాలంటే
భవిష్యత్తు పునాదులు స్పష్టమై ఉండాలి
కల్పిత గాథలలో చరిత్ర నలుగుతుంది
చారిత్రక వ్యక్తి కాదు సమాజాభివృద్ధి..

చరిత్రను పునర్లిఖిస్తే సత్యం తెలుస్తుంది
అడుగున పడ్డ అభాగ్యుల వేదనలు వినిపిస్తాయి
కదనరంగంలో నరకబడ్డ మొండెం సాక్షిగా
సామాన్యుడి రక్తసిక్తపు జీవన సాగరం..

శ్రామిక జీవన సౌందర్యం కనిపిస్తుందా
రాజులు వేసిన శిక్షల గాయాలు తప్ప
ముట్టడికైన ఖర్చుల లెక్కలు తప్ప
పేదవాడి అభివృద్ధికి పంచిన పైకం ఎక్కడ..?

పాలరాతి నిర్మాణపు సొగసులు చూపిస్తూ
గుడిసెలో రాలిన నిర్మాణపు శిల్పి మర్మమేమి
గాయపడ్డ చేతులకు అందిన ఔషధమేమి
అసువులు బాసిన కన్నీటి కథలు ఎక్కడ..?
కులవృత్తిలో పుట్టిన విజ్ఞాన సౌందర్యం
పేదవాడు నిర్మించిన బహుళార్థక చాతుర్యం
గాయపడిన హృదయం పాడిన గేయం
సామాన్యుడు పాడిన అద్భుత పాటలు కావాలి..

సరికొత్త నిర్మాణ చరిత్ర జరగాలి
యుద్ధ రంగపు పరాక్రమాలే కాకుండా
పసిడి నవ్వులు పరవశించిన విధానం
లోగిళ్లలోని ఆనందపు సిరుల తాండవం చెప్పాలి..
కొప్పుల ప్రసాద్‌
98850 66235