Jul 31,2021 21:27

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయాలని ఎపి డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి కేంద్ర మంత్రులను కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కోన రఘుపతి కేంద్ర టూరిజం, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్ర ఫుడ్‌ ప్రొసెసింగ్‌ ఇండిస్టీస్‌ శాఖ మంత్రి పశుపతి కుమార్‌ పారస్‌ను కలిశారు. వారితో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఎపి భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే బలమని, రైతు పండించిన పంటకు వాల్యూ అడిషన్‌, పంట నిల్వకు గిడ్డంగులు, రాష్ట్రంలో ఫుడ్‌ ప్రొసెసింగ్‌ పరిశ్రమల ప్రాముఖ్యత, వ్యవసాయానికి సంబంధించి కేంద్రం గతంలో ప్రకటించిన పథకాలను కొనసాగించడంపై మంత్రితో చర్చించామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారని కోన రఘుపతి తెలిపారు. రాష్ట్రంలో 975 కిలోమీటర్ల పొడవు సముద్ర తీరం ఉందని, పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలు, అభివృద్ధి చేయాల్సిన మౌలిక సదుపాయాలు, టెంపుల్‌ టూరిజం, శ్రీశైలంకు ఇటీవల విడుదల చేసిన నిధులు తదితర అంశాలపై చర్చించామని తెలిపారు. సూర్యలంక బీచ్‌ అభివృద్ధికి సంబంధించి డిపిఆర్‌ను త్వరలోనే సమర్పిస్తామని మంత్రికి వివరించామన్నారు. బాపట్లలో చోళులు నిర్మించిన క్షీర భావనారాయణ ఆలయానికి సంబంధించి చేయాల్సిన పనులపై మంత్రితో మాట్లాడానని తెలిపారు.