Aug 08,2021 15:20

చౌటుప్పల్‌ : భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. భువనగిరి పార్లమెంట్‌ స్థానంలో రోడ్లు, పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తే.. ఎమ్మెల్యే, ఎంపి పదవులకు రాజీనామా చేస్తామని, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయబోమని చెప్పారు. అందుకు బాండ్‌ కూడా రాసిస్తామని పేర్కొన్నారు. చౌటుప్పల్‌ మండలంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్‌ సర్వసభ్య సమావేశంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ పాలనలో వివిధ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. దళితులకు కేబినెట్‌లో స్థానం లేదని, దళిత బంధు పేరుతో మోసం చేయడం కెసిఆర్‌కు బాగా తెలుసని అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపిలకు ప్రొటోకాల్‌ కూడా ఇవ్వడం లేదన్నారు. ఎంపి స్థానంలో ఉంటూ రెండేళ్ల నుంచి అపాయింట్‌మెంట్‌ అడిగితే ఇంతవరకు దిక్కేలేదని పేర్కొన్నారు. కేవలం గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లకే కెసిఆర్‌ సిఎంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రం పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌ది అరాచక పాలన అని, హిట్లర్‌ బతికి ఉంటే కెసిఆర్‌ను చూసి విలపించేవారని ఎద్దేవా చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని రేవంత్‌తో చెప్పినట్లు వెల్లడించారు.