Sep 14,2023 12:11

మాస్కో :   రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ తమ దేశానికి ఆహ్వానించినట్లు స్థానిక మీడియా కెసిఎన్‌ఎ గురువారం తెలిపింది. పుతిన్‌తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయని కిమ్‌ పేర్కొన్నారు. రాబోయే 100 ఏళ్ల పాటు స్థిరమైన, భవిష్యత్‌ ప్రణాళిక లక్ష్యాలను సాధించేందుకు కిమ్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. ప్రత్యేక రైలులో మంగళవారం రష్యాకు చేరుకున్న కిమ్‌  ప్రస్తుతం ఆ  దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలసి ఆయన రష్యన్‌ సుదూర తూర్పు ప్రాంతమైన అమూర్‌లోని రష్యన్‌ అంతరిక్ష రాకెట్‌ ప్రయోగ కేంద్రం (సోయజ్‌-2)ను సందర్శించారు. అనంతరం ఈ ఇరువురు నేతలు తమ ప్రతినిధి బృందాలతో  కలసి గంటకు పైగా చర్చలు జరిపారు. 

కిమ్‌ ఆహ్వానాన్ని పుతిన్‌ అంగీకరించారని  కెసిఎన్‌ఎ  పేర్కొంది. రష్యా, ఉత్తరకొరియాల మధ్య స్నేహం, చారిత్రక సాంప్రదాయాలను స్థిరంగా కొనసాగించాలనే తన సంకల్పాలన్ని పుతిన్‌ పునరుద్ఘాటించినట్లు  తెలిపింది. అయితే ఈ పర్యటన ఎప్పుడు ఉండనుందనే విషయాన్ని వెల్లడించలేదు.