ప్రజాశక్తి-తెనాలి/తెనాలిరూరల్ : నిన్న మొన్నటి వరకూ అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలను ఉక్కిరి బికిరి చేసిన వాతావరణం.. ఋతుపవనాల రాకతో చల్లబరిచింది. ఆ అను భూతి పొందుతుండగానే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం పంట పొలాలను, పట్టణం లోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. ఖరీఫ్‌లో వెదపద్ధతిలో వరి సాగుకు శ్రీకారం చుట్టిన రైతులు భారీ వర్షానికి విత్తనం మొలకెత్తదని, ఆదిలోనే నష్టపోతున్నామని వాపోతున్నారు.
ఖరీఫ్ సీజన్‌లో వర్షం కోసం ఎదురు చూసిన రైతులు సకాలంలోనే వానలతో ఆనందంగా సాగుబాట పట్టారు. ఖరీఫ్‌లో కృష్ణా పశ్చిమ డెల్టా రైతులు అధికశాతం వరి సాగు చేస్తున్నారు. మారుతున్న వ్యవసాయ పద్ధతు లకు అనుగుణంగా సాగు ఖర్చులు తగ్గించు కునేందుకు వరిని వెదపద్ధతిలో సాగు చేస్తు న్నారు. ఇప్పటికే అధికశాతం రైతులు ఈ పనుల్లో నిమగమయ్యారు. ఈ క్రమంలో సోమ వారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షం మంగళవారమూ కురుస్తుండటంతో పొలాలు జలాశయాలను తలపిస్తున్నాయి. తెనాలి చుట్టు పక్కల ప్రాంతాలైన ఐతా నగర్ శివారు. నేల పాడు, బుర్రిపాలెం ప్రాంతాల్లో పొలాల్లోకి పెద్దఎత్తున నీరు చేరడంతో వెద పెట్టిన వరి ఉరకెత్తి పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగులో ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.8 నుంచి రూ.10 వేల వరకూ ఖర్చు చేయగా ప్రారంభంలోనే ఎదరుదెబ్బ తలిగిందని రైతులు అంటున్నారు.
కాల్వలు పూడిక తీయకనే..
వేసవిలో సాగు నీటి కాల్వలు పూడిక తీయించాల్సిన అధికారులు మిన్నకున్నారని, ఫలితంగా నీటి పారుదలకు కాల్వలు అనుకూలంగా లేకపోవటంతో పాలాల్లోనే నీరు నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం రైతు సంఘం ప్రతినిధి బృందం పంట కాల్వలను పరిశీలించింది. ఐతానగర్, పెదరావూరు, జగ్గడిగుంటపాలెం ప్రాంతాల్లో పర్యటించి, కాల్వలు పూడుకుపోవటం గమనించిందింది. ఖరీఫ్ తరుణం ఆసన్నమైన నేపథ్యంలో కాల్వలు పూడిక తీయించాలని అధికారులను రైతు నాయకులు డిమాండ్ చేశారు. పూడిక తీయకుంటే ప్రస్తుత పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. అయినా అధికారుల్లో స్పందన లేమి ఇప్పుడు నష్టం తెచ్చింది.
కల్వర్టు నిర్మాణమూ కారణమే..
ఐతానగర్, నేలపాడు ప్రాంతంలోని పొలాల్లో నీరు నిలవడానికి కల్వర్టు నిర్మాణం కూడా కారణంగా రైతులు చెబుతున్నారు. జగనన్న కాలనీ వద్ద పంట కాల్వపై ఓ కల్వర్టు నిర్మాణాన్ని అధికారులు మూడు నెలల క్రితం ప్రారంభించారని, దీంతో అక్కడ కాల్వను పూడ్చి వేయటంతోనే నీరు పొలాల్లోకి ఎగదన్నిందని ఐతానగర్‌కు చెందిన కౌలు రైతు మేకల చిట్టిబాబు చెబుతున్నారు.
బస్టాండ్‌తో సహా పలు ప్రాంతాలు జలమయం
సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో పెద్ద ఎత్తున నీరు చేరింది. తెనాలి నుంచి విజయవాడ, మంగళగిరి వైపు వెళ్లే బస్సులు నిలిపి ఉంచే ప్రాంతంలో భారీగా నీరు చేరి ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు ఎక్కాలన్నా, దిగాలన్నా మహిళల ఇబ్బందులు వర్ణనాతీతం. బోస్‌రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి స్వరాజ్ కూడలి వరకు, చినరావూరు పార్కు మలుపులో, బుర్రిపాలెం రోడ్డులో, తహశీల్దార్ కార్యాలయం ఎదురు రోడ్డులో వర్షం నీరు బారీగా నిలించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.










