May 27,2023 22:12

1న కాలువలకు నీరు విడుదల
రైతులను వెంటాడుతున్న సమస్యలు
విత్తనాలపై నామమాత్రపు సబ్సిడీతో మమ
కౌలురైతులకు సకాలంలో రుణాలు ఇస్తారా
ఆధునికీకరణ లేక ఈ ఏడాదీ రైతులకు కష్టాలే
ముందస్తు సాగుపై రైతులకు అవగాహన కల్పించేనా
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఖరీఫ్‌ సాగుకు సంబంధించి జూన్‌ ఒకటిన కాలువలకు సాగునీరు విడుదల చేసేందుకు ఇరిగేషన్‌ శాఖ సిద్ధమవుతోంది. రబీసాగులో ధాన్యం కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఖరీఫ్‌ సాగులో ఎదురుకానున్న సమస్యలపై కలత చెందుతున్నారు. ఖరీఫ్‌లో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలవ్యాప్తంగా నాలుగు లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగవనుంది. దీనికి సంబంధించి విత్తనాలు దాదాపు 70 శాతానికిపైగా రైతు నుంచి రైతుకు మార్పిడి జరుగుతోంది. 30 శాతం మంది రైతులు విత్తన షాపుల్లో కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉంది. తమది రైతు ప్రభుత్వమని చెప్పడం తప్ప విత్తనాల సరఫరాలో రైతులకు సబ్సిడీ అనేది పెద్దగా లేకుండాపోయింది. విత్తనాలకు సంబంధించి కిలోకు రూ.ఐదు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. 30 కిలోల విత్తన బస్తా దాదాపు రూ.1100 వరకూ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.150 కూడా ఉండటం లేదు. దీంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. విత్తనాలకు సంబంధించి 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో విత్తన కొనుగోలు రైతులకు భారంగా మారింది. ప్రభుత్వం విత్తన సబ్సిడీ పెద్దగా ఇవ్వకపోవడంతో విత్తనాలు విక్రయించే రైతులు సైతం ధర ఎక్కువగా నిర్ణయిస్తున్నారు. 75 కిలోల విత్తనాలు రూ.రెండు వేలకుపైగానే చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తే రైతులకు ఎంతగానో మేలు జరిగే అవకాశమున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కౌలు రైతులకు రుణాలిచ్చేనా..?
రెండు జిల్లాల్లోనూ వ్యవసాయ సాగులో కౌలు రైతులదే కీలక పాత్ర. దాదాపు మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నారని, 70 శాతం సాగు వీరే చేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. సాగు చేసే కౌలురైతులకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి మేలూ జరగడం లేదు. భూయజమాని అంగీకారం లేకుండా కౌలుకార్డులు ఇవ్వడం లేదు. కౌలుకార్డులు లేవనే సాకుతో కౌలురైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఎకరాకు రూ.35 వేల వరకూ వరిసాగులో పెట్టుబడి ఖర్చవుతోంది. ప్రతి రైతూ రెండెకరాల నుంచి ఐదెకరాల వరకూ కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అయితే బ్యాంకులు ఇచ్చే పంటరుణాలు మాత్రం కౌలురైతులకు అందడం లేదు. కౌలుకార్డులు అందించే ప్రక్రియ సైతం నిబద్ధతతో అమలు చేయని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదైనా సకాలంలో కౌలుకార్డులు అందించి ఖరీఫ్‌ సాగుకు అవసరమైన రుణాలు కౌలురైతులకు అందించేనా అనే అనుమానం నెలకొంది. కౌలురైతులకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
ముందస్తు సాగుపై అవగాహన కల్పించేనా..?
ప్రతియేటా జూన్‌ ఒకటో తేదీన సాగునీరు విడుదల చేస్తున్నప్పటికీ నారుమడులు మాత్రం ఆలస్యంగా వేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం రైతులకు అవగాహన కల్పించకపోవడమేనని చెప్పొచ్చు. ఖరీఫ్‌ నారుమడులు ఆలస్యం కావడంతో డిసెంబర్‌ నెలాఖరు వరకూ ఖరీఫ్‌ మాసూళ్లు సాగుతున్నాయి. దీంతో రబీసాగు ఆలస్యమవుతోంది. ప్రస్తుత ఏడాదినే తీసుకుంటే ఈ నెల 20వ తేదీ వచ్చేవరకూ రబీ మాసూళ్లు సాగుతూనే ఉన్నాయి. మే నెలలో వచ్చిన అకాల వర్షాలకు రబీ పంట దొరికిపోయింది. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖరీఫ్‌లో ముందస్తు సాగుపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. కాలువలకు నీరు విడుదలైన తర్వాత నారుమడులు త్వరితగతిన వేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.
50 శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించాలి
కె.శ్రీనివాస్‌, రైతుసంఘం జిల్లా కార్యదర్శి
ఖరీఫ్‌ సాగులో 50 శాతం సబ్సిడీపై రైతులకు అవసరమైన విత్తనాలు అందించాలి. రైతులకు విత్తన సబ్సిడీ అనేది అందకుండా పోతుంది. నాణ్యమైన విత్తనాలు దొరకకపోతే తెగుళ్లుబారిన పడి రైతులు పంటను కోల్పోయే ప్రమాదం ఉంది. భూయజమాని అంగీకారంతో సంబంధం లేకుండా కౌలురైతులందరికీ రైతుభరోసా కేంద్రాల ద్వారా కౌలు కార్డులు అందించి బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి.
వెంటాడనున్న ఆధునికీకరణ సమస్య
రెండు జిల్లాల్లో 11 ప్రధాన కాలువలు 300కుపైగా పిల్ల కాలువల ద్వారా సాగునీరు సరఫరా అవుతోంది. ప్రభుత్వం కాలువల ఆధునికీకరణ పనులను పూర్తిగా పక్కన పెట్టేసింది. గడిచిన మూడేళ్లుగా తూడు తీయడం వంటి చిన్నచిన్న పనులు మినహా పూడికతీత, షట్టర్ల మరమ్మతులు వంటి పనులు జరగని పరిస్థితి నెలకొంది. దాదాపు రూ.వెయ్యి కోట్లకు సంబంధించిన ఆధునికీకరణ పనులు అలానే ఉండిపోయాయి. వర్షాలు కురిస్తే నారుమడులు, నాట్లు నాటిన పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఈ ఏడాది రైతులు ఆధునికీకరణ లేమి సమస్యలను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడనుంది.