ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి అప్పులు చేసి ఆరుగాలం కష్టించి పని చేస్తున్న అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వ తీరుతో అన్ని రకాల సీజన్లలో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖరీఫ్‌లో ఇప్పుడు పెట్టుబడులు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. బ్యాంకులు సక్రమంగా రుణాలు ఇవ్వకపోవడం, ప్రధానంగా ధాన్యం బకాయిలు భారీగా పేరుకుపోవడంతో పెట్టుబడి కష్టాలు మరింత పెరిగాయి. ఈ ఏడాది కాకినాడ జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగింది. మొత్తంగా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ 11వరకూ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించలేదు. ప్రారంభించినా ఆదు నుంచి ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను నత్తనడకనే సాగించింది. దీంతో పలువురు దళారులకు అమ్ముకోవడం మొదలు పెట్టారు. సిబ్బందిని పూర్తిస్థాయిలో సన్నద్ధత చేయలేకపోయింది. గోనె సంచలు కొరత, ఇతర సమస్యలతో కొనుగోళ్లు మందుకొడిగా సాగాయి. తేమ శాతం నిబంధనలతో ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. మధ్యలో వరదలు వెంటాడాయి. దీంతో వందలాది మంది రైతుల పంట కొనుగోలు చేయకుండానే నీటిలో నానిపోయి కుళ్లి నష్టపోవాల్సి వచ్చింది. దీంతో కొద్దిరోజులు కొనుగోలు మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలోనే అనేక మంది రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
రూ.15.47 కోట్లు బకాయిలు
జిల్లాలో 11,511 మంది రైతుల నుంచి రూ.173.35 కోట్లు విలువ గల 84,976 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయగలిగింది. ఇప్పటి వరకు రూ.157.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ.15.47 కోట్లు రైతులకు అందాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 21 రోజుల లోపు ధాన్యం డబ్బులు రైతులకు అందాలి. కానీ నెల రోజులు పైనే గడుస్తున్న పలువురు రైతులకు నేటికీ ఈ ధాన్యం సొమ్ములు జమ కాలేదు.రూ.12.15 కోట్లు పేమెంట్ చేయడానికి బ్యాంకులకు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా రూ.3.32 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉందని తెలిపారు.
లక్ష్యానికి దూరం
సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా ప్రభుత్వ మాత్రం కేవలం 2.60 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని లక్ష్యంగా తీసుకుంది. కేవలం 84 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నడపలేకపోవడమే ఇందుకు కారణం. యంత్రాంగాన్ని సన్నద్ధత చేయడంలో విఫలం అవ్వడం మరో కారణం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు అడ్డు తగలడంతో అనేక మంది రైతులు కొనుగోలులో తీవ్ర అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బస్తా వద్ద రూ.150 నుంచి రూ.200 వరకు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకున్నారు.
పెట్టుబడుల కోసం ఎదురుచూపులు
ఎన్ని కష్టాలు ఎదురైనా రైతులు మళ్లీ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే తొలకరి పలకరించింది. రైతులు నారుమడులను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుల కోసం తిరుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం గత రబీ డబ్బులు ఇంకా జమ చేయలేదు. వెంటనే పాలకులు స్పందించి బకాయి ఉన్న సొమ్ములను విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.










