Jul 02,2023 21:12

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

రాయచోటి : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు ముందే అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు వేసవి దుక్కులు చేయడంలో బిజీ అయ్యారు. ఖరీఫ్‌ పంటల సాగుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఖరీఫ్‌ సాగు ప్రణాళికలను సిద్ధం చేశారు. రైతులకు అవసరమైన వేరుశనగ విత్తనాలు ఇప్పటికే పంపిణీ చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు సైతం కావలసినంత నిల్వ ఉంచారు. ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం ఇది జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 82,589 హెక్టార్లు. వరి పంట సాధారణ విస్తీర్ణం 9,748 హెక్టార్లు. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 47,885 హెక్టార్లు. ఖరీఫ్‌ సీజనులో నాణ్యమైన, ధ్రువీకరించిన వేరుశనగ విత్తనాలను రైతుభరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. కె6, నారాయణి రకాల విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను కిలో రూ.51.48కి వ్యవసాయ అధికారులు రైతులకు అందజేశారు. ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 47,885 హెకార్టర్లు. వేరుశనగ కనీస మద్దతు ధర రూ.5,550 కాగా గతేడాది రూ.6,500 వరకు పలికింది. ఈ ఏడాది రూ.6,800 నుంచి రూ.7 వేల వరకు పలుకుతోంది. మార్కెట్‌లో ఎంఎస్‌పికి మించి ధర లభిస్తుండడంతో ఈసారి కూడా లక్ష్యానికి మించే సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలతో పాటు వేరుశనగ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వేరుశనగ విత్తనాలు 52,085 క్వింటాళ్లు అవసరంగా వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ మేరకు జిల్లాకు విత్తన కేటాయింపు జరిగింది. ఇందులో కే-6 రకం 37,512 క్వింటాళ్లు, నారాయణి రకం 14,573 క్విటాళ్లు, కేటాయించారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 39,956 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరంగా గుర్తించారు. యూరియా 2,795 మెట్రిక్‌ టన్నులు, డిఎపి 152, పొటాష్‌ 151, కాంప్లెక్సు ఎరువులు 236 మెట్రిక్‌ టన్నులు ఆర్‌బికెలకు చేరాయి.
జాతీయ ఆహార భద్రత పథకం
జాతీయ ఆహార భద్రత పథకం కింద 750 కిట్లు వేరుశనగ, 9,000 కిట్లు కంది, 800 కిట్లు రాగి, 150 కిట్లు కొర్ర చిరు సంచులను పంపిణీ చేశారు. గ్రామ విత్తన పథకం కార్యక్రమాన్ని సుండుపల్లి మండలం చిన్న గొల్లపల్లి గ్రామంలో సజ్జ పంట పైన చేస్తారు. కార్యక్రమంలో భాగంగా ఏబీవీ 04 రకం సజ్జ విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందించడం జరిగింది.
గతంలో ఇబ్బందులు పడే వాళ్లం
రైతు భరోసా కేంద్రంలో మూడు బస్తాలు వేరుశనగ విత్తన కాయలు తీసుకున్నాను. నాకున్న రెండెకరాల పొలంలో సాగు చేసేందుకు ఆ విత్తనాలను సబ్సిడీతో తీసుకున్నాను. గతంలో విత్తన కాయల కోసం ఇబ్బందులు పడే వాళ్ళం. పనులు మానుకొని క్యూలో నిల బడి విత్తన కాయలు తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మా సమీ పంలో ఉన్న ఆర్‌బికెలలోవిత్తన కాయలు తెచ్చుకుంటున్నాం.
-దండు నారాయణరెడ్డి రైతు,సంబేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా.
వ్యవసాయం పండుగ అవుతోంది
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేస్తోంది. ప్రతి ఏటా ఖరీఫ్‌ సీజన్‌కు ముందుగానే వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం విడుదల చేసింది. వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కేంద్రాల ఆలోచన వినూత్నంగా ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వీటిద్వారా రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్న తీరు అద్భుతం. ఆర్‌బికెల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు గ్రామస్ధాయిలోనే అందించే ఏర్పాటు చేసింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించేందుకు నియోజకవర్గం స్థాయిలోనే వైఎస్‌ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు అయ్యాయి. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించే ఏర్పాటు చేయడం శుభపరిణామం.
-గడికోట శ్రీకాంత్‌రెడ్డి,ఎమ్మెల్యే
విత్తనాల పంపిణీ పూర్తి
ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు సన్నద్ధ మవుతున్నాం. వేరుశనగ విత్తనాల పంపిణీ వంద శాతం పూర్తయింది. కావాలసినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఎరువులు సరఫరా ప్రారంభమైంది. నెలఖారుఖకు రైతు భరోసా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఎరువులు నిల్వ చేస్తాం. అనంతరం రైతులకు పంపిణీ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలతో పాటు వేరుశనగ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు.
-జిల్లా అగ్రికల్చర్‌ అధికారి చంద్రనాయక్‌.
ఎరువులు ఆర్‌ బికెలో అందుబాటులో ఉంచుతున్నాం
రైతులకు ఆర్‌బికె స్థాయిలోనే అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. రైతులకు అందుబాటులో ఎరువులను ఉంచుతున్నాం. సీజన్‌కు ముందుగానే ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉంచుతున్నాం. కియోస్క్‌లో బుక్‌ చేసుకున్న గంటల్లోనే వాటిని డోర్‌ డెలివరీ చేస్తున్నాం. ఆర్‌బికెలలో పంట కొనుగోలు కేంద్రాలుగా తీర్చిదిద్దాం. ఇప్పటికే వ్యవసాయ శాఖ ద్వారా అన్నమయ్య జిల్లాలో వంద శాతం వేరుశెనగ విత్తన కాయల పంపిణీ పూర్తి చేశాం.
-కలెక్టర్‌ గిరీషా పిఎస్‌.అన్నమయ్య జిల్లా .