Jun 27,2023 00:22

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : నైరుతీ రుతుపవనాల ప్రభావంతో 10 రోజుల కిందట గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రారంభమైన వర్షాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలో వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా పల్నాడు జిల్లాలోని కొన్ని మండలాల్లో సరిగాలేదు. గుంటూరు జిల్లాలోని 18 మండలాలకు గాను 11 మండలాల్లో అవసరానికి మించి వర్షపాతం నమోదైంది. జిల్లాలో జూన్‌ నెల మొత్తం 97.1 మిల్లీ మీటర్లవర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 114.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మేడికొండూరులో అత్యధికంగా 204.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా తెనాలిలో 202.4 మిల్లీమీటర్లు నమోదైంది. పొన్నూరు, వట్టిచెరుకూరు, పెదకాకానిలో సాధారణ వర్షపాతం నమోదు కాగా తాడికొండ, తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
పల్నాడు జిల్లాలో మొత్తం 28 మండలాలకు గాను 10 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా మిగతా వాటిల్లో సాధారణం, అంతకంటే తక్కువ వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో జూన్‌ నెలలో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 80.8 మిల్లీ మీటర్లు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. సత్తెనపల్లిలో అత్యధికంగా 192.4, తరువాత యడ్లపాడులో156.4 మీల్లీ మీటర్ల వర్షం కురవగా మరో 8 మండలాల్లో 100 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో బాగా తక్కువగా వర్షం కురిసింది. మాచర్లలో అత్యల్పంగా 10.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
పల్నాడులో ఇంకా వ్వవసాయ పనులు ప్రారంభం కాలేదు. బోర్ల కింద సాగు అవుతున్న భూముల్లో ముందస్తు ఖరీఫ్‌ ప్రారంభమైంది. మిగతా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీగా కురిసిన ప్రాంతాల్లోనే సాగుపనులు ప్రారంభం అవుతున్నాయి. డెల్టాలో నారుమళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. మేడికొండూరు, ఫిరంగిపురం తదితర ప్రాంతాల్లో పత్తి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రకాశం బ్యారేజి నుంచి డెల్టా కాలువలకు సాగు నీటిని ఈనెల 7వ తేదీన నీటిని విడుదల చేసినా ఇంతవరకు పూర్తిస్థాయిలో కాల్వలకు నీరు రావడంలేదు. పశ్చిమ డెల్టాకు 100 క్యూసెక్కులే విడుదల చేస్తున్నారు. డెల్టాలో వరి నారుమళ్లకు ఇంకా నెల పాటు గడువు ఉందని రైతులు చెబుతున్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజికి 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గుంటూరు ఛానల్‌, సాగర్‌ కాల్వలకు కూడా నీటి విడుదల ప్రారంభం కాలేదు. వర్షాలు పూర్తిస్థాయిలో కురిసిన తరువాత ఎగువ నుంచి వచ్చే వరద నీటి ప్రవాహాన్ని బట్టి కాల్వలకు నీటి విడుదల ఉంటుందని అధికారులు చెబుతున్నారు.