కడప అర్బన్ : జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాలను మరింత లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వి.విజరు రామరాజు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో రాష్ట్ర ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్ పి.శివ ప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ సలహా మండలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో రైతులు లాభాల బాటలో నడిచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తతమైన సేవలు అందివ్వాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రోత్సహకాల కారణంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగుబడి విస్తీర్ణ లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఖరీఫ్ సాగుబడికి అవసరమైన సాగు నీటిని అందించేందుకు సంబందిత నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లా డాలన్నారు. ఆర్‌బికెల పరిధిలో వ్యవసాయ సహాయకులు సీజన్ వారీగా ఆయా ప్రాంతాల్లో పండించే పంటలు, వాటికి ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణ, ఆయా పైర్లకు అందాల్సిన పోషక విలువలు, ఎరువుల వాడకం మొదలైన ప్రక్రియల నిర్వహణపె ముందస్తుగా రైతులకు అవగాహన కల్పించాలని తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుదారు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రాగి, జొన్న, కంది పంటల సాగు విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి ఆర్‌బికెలలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన, వ్యవసాయాధికారులు ఆమోదించిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ గోడౌన్ల నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవసాయ సలహా బోర్డు ఛైర్మెన్ పి. శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రైతుల అభివద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగుతొందన్నారు. వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల పట్ల పశు వైద్యులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీకాలు వేయించాలని తెలిపారు. అంతకు ముందు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ శాఖల శాఖలు సాధించిన ప్రగతిని, ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలను, ఆర్‌బికె సేవలను వివరించారు. సమావేశంలో జెసి గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఎపిఎంఐపి పీడీ రవీంద్రరెడ్డి, సీఎంఎన్‌ఎఫ్ (ప్రకతి వ్యవసాయం) డిపిఎం రామకష్ణ, ఆత్మ పీడి విజయ కుమారి, డీసిఓ సుభాషిణి, ఎల్డిఎం దుర్గా ప్రసాద్, మైనర్ ఇరిగేషన్ అధికారులు, పట్టు పరిశ్రమ శాఖ ఎడి శ్రీనివాసుల రెడ్డి, ఉద్యానశాఖ, మత్స్యశాఖ, సహకార, సివిల్ సప్లై, వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.










